సకల సౌభాగ్యాల కల్పవల్లి.. వరలక్ష్మీ
నేడు సామూహిక వ్రతాలు
ఉమ్మడి జిల్లాలో ఆలయాలు ముస్తాబు
నేడు వరలక్ష్మీ వ్రతం
ఆలయాల్లో సామూహిక వ్రతాలు
వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే
శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం సంప్రదాయం. కుటుంబ సభ్యుల క్షేమం కోసం.. సకల సౌభాగ్యాల కోసం.. మహిళామణులు వ్రతాలు ఆచరించి తోటిమహిళలకు పసుపు, కుంకుమ, పండ్లు అందజేసి ఆశీర్వాదం పొందుతారు. ఈ మాసంలో పూజలు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని భక్తుల నమ్మకం. ఈ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. సామూహిక వ్రతాల
కోసం ఆలయాలు ముస్తాబయ్యాయి.
గద్వాలటౌన్/వనపర్తి టౌన్, ఆగస్టు19: శ్రావణ మాసం శుక్లపక్షంలో శ్రావణ పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం హిందువుల ఆచారంగా వస్తున్నది. హిందూ మతం ప్రకారం ఈ వ్రతాన్ని ఓ పండుగలా జరపుకొంటారు. ప్రతి ఆలయం, ప్రతి ఇల్లు తోరణాలతో ముస్తాబు చేస్తారు. ప్రతి మహిళా వ్రతాన్ని ఆచరిస్తుంది. వరాలు ఇచ్చే దేవతగా అమ్మవారిని కొలుస్తారు. అమ్మవారిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నది ప్రగాఢ విశ్వాసం. అదే విశ్వాసంతో ప్రతి ఏడాది వచ్చే శ్రావణ మాసంలో అమ్మను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.
పురాణ గాధ..
పరమేశ్వరుడు పరమేశ్వరికి వరలక్ష్మీ వ్రతం గురించి వివరించడాన్ని స్కంద పురాణంలో తెలిపినట్లుగా పురోహితులు చెప్తారు. పురాణంలో తెలిపినట్లుగా లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పొందే విధంగా ఏదైనా వ్రతాన్ని తెలపాలని పరమేశ్వరుడిని పార్వతీదేవి కోరుతుంది. ఇందుకు పరమేశ్వరుడు చారుమతి దేవి కథను వివరిస్తారు. భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ఇస్తూ ఉత్తమ ఇల్లాలుగా చారుమతి తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే మహాలక్ష్మీని భక్తి శ్రద్ధలతో ప్రతి నిత్యం కొలిచేది. ఇందుకు దేవి స్వప్నంలో ఆమెకు ప్రత్యక్షమై శ్రావణ పూర్ణిమ కంటే ముందు వచ్చే శుక్రవారం తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ తీరుస్తానని అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం శుక్రవారం చారుమతి వ్రతాన్ని ఆచరించి సకల సంపదలు అందుకుంటుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తాడు. దీంతో పార్వతీ దేవి కూడా వ్రతాన్ని ఆచరించి లోకంలో ్రస్త్రీలందరూ ఆచరించి సకల సౌభాగ్యాలు పొందేవిధంగా వరాన్ని ప్రసాదించిందని పండితులు చెప్తున్నారు.
వ్రతం ఎందుకు..
అష్టలక్ష్మీలలో వరలక్ష్మీదేవికి ప్రత్యేక స్థానం ఉంది. అమ్మవారి పూజ ఎంతో శ్రేష్టమైనదిగా పురోహితులు చెప్తారు. శ్రీహరికి ఎంతో ఇష్టమైన మాసం, విష్ణువు జన్మనక్షత్రం శ్రవణం పేరు మీద వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయట. సకల అభీష్టాలు సిద్ధించాలని, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని స్త్రీలు వ్రతాన్ని ఆచరిస్తారు.
వ్రత విధి విధానం..
తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించాలి. తరువాత కలశంలోకి వరలక్ష్మీ దేవిని ఆవాహనం చేసుకోవాలి. తరువాత అష్టోత్తర శత నామావళిని చదవాలి. ధూప దీప నైవేద్యాలను అమ్మకు సమర్పించాలి. మహామంగళ హారతి ఇవ్వాలి. తోర గ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రాన్ని పఠిస్తూ నవ సూత్రాన్ని కట్టుకోవాలి. చివరగా వాయన దాన మంత్రాన్ని పఠిస్తూ ముత్తయిదువులకు తాంబూలం ఇస్తూ వారిని వరలక్ష్మీగా భావిస్తూ వాయనం సమర్పించాలి.
కావాల్సిన పూజా సామగ్రి
పుసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూల దండలు, ఆకులు ఒక్కలు, ఆగరవత్తులు, కర్పూరం, డబ్బులు, తెల్లనివస్త్రం, రవికలు, మామిడి ఆకులు, పండ్లు, అమ్మవారి ఫొటో, కలశం,కొబ్బరి కాయలు, తెల్లని దారం, కంకణాలు, నైవేద్యం, పంచామృతం తదితర పూజా సామగ్రి ముందుగా ఏర్పాటు చేసుకోవాలి.
నేడు సామూహిక వ్రతాలు
వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని శుక్రవారం వివిధ ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. వేదనగరలోని దయానంద విద్యామందిరం వద్ద కూడా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.