ఆత్మకూరు, ఆగస్టు 18: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ బంగారు శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీపీ హాజరై మాట్లాడారు. పరిసరాల శుభ్రతతోపాటు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవన్నారు. ఇండ్ల పరిసరాల్లో మురుగు నిల్వ ఉండకుండా చూసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్ పేర్కొన్నారు. వైద్యాధికారులు మాట్లాడుతూ డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, పిచ్చి మొక్కలను తొలగించుకోవాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఇంట్లో దోమ తెరలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రమేవ్, వైద్యాధికారులు భరధ్వాజ్, నిస్సార్, ఆరోగ్యసిబ్బంది సురేందర్‌గౌడ్, సామ్రాజ్యలక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పాన్‌గల్ మండలంలో..
పాన్‌గల్, ఆగస్టు 18: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు బుధవారం సీజనల్ వ్యాధులపై పీహెచ్సీ డాక్టర్ వంశీకృష్ణ, డీపీవో సురేశ్‌కుమార్ అవగాహన కల్పించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వీధులన్నీ బురదగా మారాయని, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. గ్రామా ల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డాక్టర్ రాముడు, ఈవోఆర్డీ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రేమద్దులలో హెల్త్‌అసిస్టెంట్ రాంచందర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది జ్వర పీడితులపై ఇంటింటి సర్వే చేపట్టారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం శాంతమ్మ, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
వీపనగండ్ల మండలంలో..
వీపనగండ్ల, ఆగస్టు18: మండలంలోని బొల్లారంలో డాక్టర్ రాజశేఖర్, పర్వతాలు గురువారం వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలో విషజ్వరాలు తగ్గముఖం పడుతున్నాయని తెలిపారు. పరిసరాల శుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.