మరుగుదొడ్డిలో పాతిన మృతదేహానికి పోస్టుమార్టం
ఉలిక్కిపడ్డ మొరంబాయి
నవాబ్‌పేట, సెప్టెంబర్2: మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం మొరంబాయిలో సంచలనంగా మారిన పండుగ చెన్నయ్య హత్య మిస్టరీ వీడుతున్నది. భూమి విక్రయించిన డబ్బులు తమకు ఇవ్వకుండా ఆడబిడ్డలకు ఇస్తున్నాడనే ఆవేశంతో చెన్నయ్యను రెండు నెలల కిందట ఇంట్లోనే హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా గురువారం పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో మరుగుదొడ్డిలో పాతిన చెన్నయ్య మృతదేహాన్ని వెలికితీశారు. స్థానిక పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు… పండుగ చెన్నయ్య నాలుగు నెలల కిందట తన పేరున ఉన్న ఒక ఎకరా భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులతో గ్రామంలోనే ఇల్లు నిర్మించాడు. కాగా భూమి విక్రయించిన డబ్బులు తనకు ఇవ్వకుండా ఆడపడుచులకు ఇచ్చాడంటూ కోపం పెంచుకున్న భార్య రాములమ్మ..భర్తను ఎలాగైనా అంతమొందించి మిగతా భూమి విక్రయించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే రెండు నెలల కిందట వారు నూతనంగా నిర్మిస్తున్న ఇంటిలోనే విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో భర్త చెన్నయ్య, కొడుకు రమేశ్, హన్వాడ మండలం చిన్నదర్పల్లి గ్రామానికి చెందిన రఘు, మొరంబాయికి చెందిన ఆమె బావ పెంటయ్య కలిసి మద్యం సేవించారు. అనంతరం పథకం ప్రకారం చెన్నయ్యను గొంతు నులిమి హత్య చేసి నూతనంగా నిర్మిస్తున్న ఇంటి ఆవరణలోని మరుగుదొడ్డిలో మృతదేహాన్ని రెండు ఫీట్ల లోతులో పాతిపెట్టారు. తర్వాత నాలుగు రోజులకు తన భర్త కన్పించడం లేదంటూ..నాటకమాడింది. పోలీసుల విచారణలో తానే హత్య చేశానని ఒప్పుకున్నది. మొదట ఒక్కదాన్నే హత్య చేశానని చెప్పినా పోలీసుల విచారణలో మాత్రం నలుగురు కలిసి హత్య చేసినట్లు తేలింది. కాగా గురువారం నవాబ్‌పేట తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, రూరల్ సీఐ మహేశ్వర్రావ్, నవాబ్‌పేట ఎస్సై శ్రీకాంత్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో తవ్వకాలు చేపట్టడంతో చెన్నయ్య కుల్లిన శవం బయటపడింది. శవానికి మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖాన హెచ్‌వోడీ డా.పార్వతి ఆధ్వర్యంలో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని బంధువులకు అప్పగించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.