జహీరాబాద్, జనవరి 19 : రోజుకో ఆపిల్ తింటే, డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చని అంటారు.. కానీ, ఒక జామ కాయ పది ఆపిళ్లతో సమానమని చాలా మందికి తెలియదు.. పేదోడి ఆపిల్‌గా ప్రాచుర్యంలో ఉన్న జామ పండు శీతాకాలంలో ఎక్కువగా లభిస్తాయి. ప్రస్తుతం వేసవి, వాన , శీతాకాలంలో అనే తేడా లేకుండా పండ్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆరోగ్యాన్ని చేకూర్చే జామ సాగుతో అధిక లాభాలు వస్తున్నాయి. జహీరాబాద్ ప్రాంతంతో అధికంగా జామ తోటలు ఉన్నాయి. సీజన్లో జామ పండ్లు కిలో రూ.50 నుంచి 60 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. జహీరాబాద్ ప్రాంతంలో పండిస్తున్న జామ హైదరాబాద్‌కు ఎక్కువగా తరలుతున్నాయి.
పోషకాలు పుష్కలం..
ప్రజలకు శీతాకాలంలో అందుబాటులో తక్కువ ధరకు లభించే పండు జామ. చలికాలం రాగానే వ్యవసాయ బావులు, బోరులు, ఇంటి ఆవరణలో ఉన్న చెట్లుకు పచ్చగా కనిపిస్తూ నోరూరిస్తుంటాయి జామ పండ్లు. జామ పండులో విటమిన్ సీ కెరోటినాయిడ్స్ ఫోలెట్ పొటాషియం, పీచు, కాల్షియం, ఐరన్, విటమిన్లు, మినరల్స్ ఉండే అద్భుత ఫలం జామ పండు. తేనె పూసిన కత్తిలా మానవాళి జీవితాన్ని నిర్వీర్యం చేస్తున్న మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేందుకు జామ ఎంతగానో దోహదం చేస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
ప్రకృతి సిద్ధంగా..
ప్రకృతి సిద్ధంగా జామ చెట్లు పొలం వద్ద పెరుగుతాయి. కొందరు రైతులు జామ తోటలు పెంచుతారు. వ్యవసాయ బావులు, బోర్ల వద్ద రైతులు తప్పకుండా రెండు, మూడు చెట్లు పెడతారు. జామలో అధికంగా సీ విటమిన్ ఉండడంతో ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. పండులో కన్నా, పచ్చికాయలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. కాయను ఎండబెట్టి, పొడి చేస్తే మరింత ఎక్కువగా లాభం చేకూర్చుతుంది. జామ గింజల్లో 14శాతం సువాసన భరితమైన నూనె 15శాతం ప్రోటీన్లు, 13 శాతం పిండిపదార్థాలుంటాయి. జామతో ఉడికించిన జామ్‌ను క్యాండిల్ జెల్లీలు, జామ్‌లు, జ్యూస్‌ల తయారీలోనూ వాడుతారు. కొన్ని దేశాల్లో జామ పండ్లు, ఆకులతో చాయ్ చేస్తారని నిపుణులు తెలుపుతున్నారు.
వైద్యపరంగా ప్రాధాన్యం
ఆయుర్వేదంలో జామ పండుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వైద్యపరంగా జామకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మోతాదుకు మించి తినేసి, అజీర్తితో బాధపడేవారికి జామనే మందు. మధుమేహ వ్యాధిరోగులు జామ ఆకు నమిలితే, షుగర్ కంట్రోల్లో ఉంటుందని పరిశోధనల్లో తేలింది. జామ ఆకులు నూరిన పుండ్లు, కీళ్లలొప్పులకు రాస్తే నొప్పి అదుపులో ఉంటుంది. జామతో భయంకరమైన పంటినొప్పి తగ్గిపోతుంది. జామ ఆకులతో డికాషన్ తాగితే దగ్గు, గొంతునొప్పి వాంతులు కావడం తగ్గుతాయి. కలరా, డయేరియాతో బాధపడే వారికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది.