హైదరాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ): అన్నిరంగాల్లో అణచివేతకు గురవుతున్న మాదిగలకు తమగళాన్ని వినిపించేందుకు సొంత మీడియా అవసరమని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. గుర్రం జాషువా, బీఆర్ అంబేదర్, బాబు జగ్జీవన్‌రామ్, సదాలక్ష్మి లాంటి మేధావులను మాదిగ జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ కోఠిలోని బీసీ సాధికార సంస్థ కాన్ఫరెన్స్ హాలు లో శనివారం తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర మూడో మహాసభ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు బూరుగుల నాగేంద్ర అధ్యక్షతన జరిగింది.
ముఖ్యఅతిథిగా హాజరైన రాజయ్య మాట్లాడుతూ మాదిగ సమాజానికి మీడియాపరంగా సొంత గొంతుక అవసరమ ని సూచించారు. మాదిగ సమాజంలో పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తుల చరిత్రను డాక్యుమెంటరీలుగా చిత్రీకరించాల్సిన బాధ్య త మాదిగ జర్నలిస్టులపై ఉన్నదని చెప్పారు. అవకాశం, సందర్భాన్ని బట్టి జాతిపక్షాన గొంతెత్తాలని సూచించారు. మహాసభలో పాపని నాగరాజు, ఇంద్రవెల్లి రమేశ్, పాల్వా యి బాలయ్య, సుంచు లింగయ్య, పానుగంటి సురేందర్, టీ హుస్సేన్, ప్రేమ్‌కుమార్, పీ తిరుపతి, కార్యదర్శులు సుక అశోక్, దుబ్బా నాగేశ్, కోశాధికారి కే ముఖేశ్, రాష్ట్ర నాయకులు సదానందం పాల్గొన్నారు.