బొంరాస్పేట జనవరి 13: ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి లగచెర్ల గ్రామాభివృద్ధికి బా టలు వేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. పల్లె ప్రకృతివనం, వైకుంఠ ధా మం, కంపోస్టు షెడ్లు, డంపింగ్ యార్డు, నర్సరీ పెంపకం, చెత్తను తర లించడానికి ట్రాక్టర్, ఇంటింటికి మంచినీటి నల్లా, మంచినీటి ప్లాంటు, సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామం అభి వృద్ధిలో ముందంజలో ఉంది. ఒకప్పుడు పెంటకుప్పలు, మురికి గుంతలతో దర్శన మిచ్చే గ్రామం ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో కొత్త శోభను సంతరించుకుంది. అభివృద్ధిలో మేముసైతం అంటూ ప్రజలు, మహిళలు ముందుకు వచ్చి శ్రమదానం చేసి వీధులు, రోడ్లను శుభ్రం చేసుకున్నారు. పల్లె ప్రగతిలో మంజూరైన రూ.43 లక్షల నిధులతో లగచెర్ల పరిశుభ్ర గ్రామంగా రూపు ది ద్దుకుంది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామానికి ప్రతినెలా నిధులు మం జూరవుతు న్నాయి. ఇప్పటి వరకు మం జూరైన రూ.43 లక్షలతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.9.33 లక్షలతో వైకుంఠధామం, రూ.3.50 లక్షలతో ప్రకృతి వనం, రూ.2.20 లక్షలతో కంపోస్టు షెడ్, రూ.2.50 లక్షలతో పాఠశాలకు కాంపౌండ్ వాల్, రూ.3 లక్షలతో సీసీ రోడ్లు, ప్రజలకు శుద్ధజలం అందించడానికి రూ.1.50 లక్షలతో వాటర్ ప్లాంట్ నిర్మించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి, మొక్కలకు నీళ్లు పోసి కాపాడటానికి పంచాయతీ నిధులు రూ.11 లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేసి ప్రతిరోజూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పారిశుధ్య కార్మికులు ప్రతి రోజూ వీధులను, మురుగు కాల్వల ను శుభ్రం చేస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. అధ్వాన్నంగా ఉన్న అంతర్గత రహదారుల స్థానంలో రూ.3 లక్షలు వ్యయం చేసి సీసీ రోడ్లను నిర్మించారు. రూ.8.50 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు. పవర్ వీక్లో భాగంగా శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు.
ఆకర్షణీయంగా ప్రకృతివనం
గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనం ఆకర్షణీయంగా ఉంది. వనంలో రకరకాల మొక్కలను నాటి వాటికి నీళ్లుపోసి సంరక్షిస్తున్నారు. ఫలితంగా వనంలో పచ్చదనం కనువిందు చేస్తున్నది. సందర్శకులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా హరితహారం కార్యక్రమంలో లగచెర్ల నుంచి దుద్యాల శివారు వరకు 1.5 కిలో మీటర్ల దూరం రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. గ్రామంలోని ఖాళీ స్థలాలు, ఇళ్ల ముందు, రైతుల పొలాల్లో మొక్కలు నాటడంతో గ్రామంలో పచ్చదనం పెరిగి ఆహ్లాదక రమైన వాతావరణం ఏర్పడింది.
గ్రామానికి కొత్తరూపు
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామానికి కొత్తరూపు వచ్చింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకుని ప్రకృతివనం, వైకుంఠధామం, కంపోస్టు షెడ్, డంపింగ్ యార్డు నిర్మించాం. తడిపొడి చెత్త సేకరణపై మహిళలకు అవగాహన కల్పించాం. పారిశుధ్య కార్మికులు రోజూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. 30 రోజుల ప్రణాళికలో గ్రామంలో పాత ఇండ్లు, బావులు, పెంట కుప్పలను తొలగించి క్లీన్ చేశాం. – అనంతయ్య, సర్పంచ్