నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 3 : రూ.10 కోట్ల నిధులతో జిల్లాలో సమీకృత కోర్టు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నదని హైకోర్టు జడ్జి లక్ష్మణ్ అన్నారు. నిర్మల్‌లోని కోర్టు సముదాయంలో ఏర్పాటు చేసిన పోక్సో కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు కే లక్ష్మణ్, శ్రీదేవి ఆదివారం ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసి నిర్మల్‌కు తొలిసారి రాగా, వారికి ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి జువ్వాడి శ్రీదేవి మాట్లాడారు. తాను న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించిన చోట పోక్సో కోర్టు ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిర్మల్‌లో ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టును బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని, కేసులను సత్వరం పరిష్కరించాలని సూచించారు. నిర్మల్ బార్ అసోసియేషన్ సభ్యులకు కష్టపడే స్వభావం ఉందని, సీనియర్ న్యాయవాదులను స్ఫూర్తిగా తీసుకొని యువ న్యాయవాదులు అదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని సూచించారు. కేసులను సత్వరమే పరిష్కరిస్తూ రాష్ట్రంలో, దేశంలో ఉత్తమ బార్ అసోసియేషన్‌గా నిర్మల్‌ను ముందుకు తీసుకురావాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రారంభించినట్లు హైకోర్టు జడ్జి లక్ష్మణ్ తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రారంభించినందుకు ఆనందించవద్దని, ఎలాంటి కేసులు లేకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టును మూసివేసినప్పుడే సంతోషించాలని సూచించారు. పోక్సో కేసులపై పోలీసులు, మీడియా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వాటిపై ఎలాంటి శిక్షలు ఉంటాయో అవగాహన కల్పించినట్లయితే కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. అనంతరం హైకోర్టు జడ్జిలను జూనియర్ సివిల్ జడ్జీలు, న్యాయవాదులు, సీనియర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి బార్ కౌన్సిల్ సభ్యులు ఫణీంద్ర భార్గవ్, పీ విష్ణు వర్ధన్, బార్ కౌన్సిల్ రాష్ట్ర వైస్ చైర్మన్ కె.సునీల్, ఆదిలాబాద్ జిల్లా జడ్జి సునీత, నిర్మల్ అదనపు జిల్లా జడ్జి హరీష, సీనియర్ సివిల్ జడ్జి రామలింగం, అడిషనల్ ఫస్ట్ క్లాస్ జడ్జి అనూష, అల్లూరి మల్లారెడ్డి, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణా గౌడ్, న్యాయవాదులు గంగాధర్, శుభకరణ్, విశ్వాస్ రెడ్డి, వివిధ ప్రాంతాల బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించి నిర్మల్ పట్టణానికి తొలిసారిగా వచ్చిన జువ్వాడి శ్రీదేవి,శ్రీహరి రావు దంపతులను పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వ కంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించా రు. జ్ఞాపికలు అందించారు. సన్మానం చేసిన వారిలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథో డ్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఆదిలాబాద్ జిల్లా జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అంజద్, జీవ వైవిధ్య మేనేజ్మెంట్ జిల్లా కమిటీ సభ్యుడు తిరుపతి, టీఆర్ఎస్ నిర్మల్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్ రెడ్డి, దేవరకోట ఆలయ చైర్మన్ లక్ష్మీ నారాయణ, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, ముజాహిద్, నాయకులు నర్సాగౌడ్, దేవరకోట ఆలయ డైరెక్టర్లు పద్మనాభం, అనిల్, శివ, భూపతి ఉన్నారు.
దస్తురాబాద్,ఏప్రిల్ 3 : హైకోర్టు జడ్జి శ్రీదేవి దంపతులను సోషల్ మీడియా ఖానాపూర్ నియోజకర్గ కో ఆర్డినేటర్ బొమ్మెన గోపీ, మండల ఇన్చార్జి అల్తాటి రాజేందర్ సన్మానించారు.
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 3 : హైకోర్టు న్యాయమూర్తులు లక్ష్మణ్, శ్రీదేవి జిల్లాకు వచ్చిన సందర్భంగా స్థానిక విశ్రాంతి భవనంలో జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. నిర్మల్ ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ అధికారి రాజేశ్వర్‌గౌడ్, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు చెందిన వివిధశాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, ఉద్యోగులు జడ్జీలకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు, తహసీల్దార్ శివప్రసాద్, కిరణ్మయి, స్థానిక అధికారులు,నాయకులు పాల్గొన్నారు.