బ్రిటిష్ పాలనలో తన ఆస్తులను అముకుని పేదలకు వైద్యసేవలందించిన ఫకీర్ షావలీని నేటికీ స్మరిస్తూ ఇక్కడి స్థానికులు ఏటా జాతర నిర్వహిస్తున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరలో ఆయన పేరిట ఏటా ఉగాది రోజు వేడుకలు జరుపుకొంటారు. ముస్లింలు, హిందువులు కలిసి హజ్రత్ ఫకీర్ షావలీ సమాధిని దర్శించుకొని ప్రార్థనలు చేస్తారు.
మండలంలోని దామెరలో గుట్టపై ఫకీర్‌షావలీ సమాధి ఉన్నది. ఇక్కడ ఏటా ఉగాది రోజున జాతర నిర్వహిస్తున్నారు. ఫకీర్‌షావలీ వైద్యుడని, ఆయన ఉగాది రోజు చనిపోతానని చెప్పాడని, ఈ రోజే అతడి మృతదేహం మాయమైందని, ఆ తర్వాత కొందరికి కలలోకి వచ్చి తాను గుట్టపై కొలువై ఉన్నానని చెప్పాడని, అక్కడికి వెళ్లి చూడగా సమాధి కనబడడంతో అప్పటి నుంచి జాతర నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతుంటారు.
బ్రిటిష్ పాలనతో ఆత్మకూర్‌లో ఆర్మీ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో సయ్యద్ హజ్రత్ ఫకీర్ షావలీ వైద్యుడిగా సేవలందించారు. ఆ సమయంలో దామెరలో గత్తర, కుష్టు ప్రబలి ప్రజలు మృత్యువాత పడుతున్నారన్న విషయం తెలిసి వారికి వైద్యం చేయాలని నిశ్చయించుకొని గ్రామానికి వచ్చి పూర్తిగా నయం చేశాడు. ప్రజల వైద్యానికి తన ఆస్తులు అమ్ముకొన్నాడని గ్రామస్తులు చెబుతుంటారు. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఆయన దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకునేవారని గుర్తు చేసుకుంటారు.
అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరుపుకొనే ఫకీర్‌షావలీ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. మండలం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన భీమదేవరపల్లి, ధర్మసాగర్, హసన్‌పర్తి, హుజూరాబాద్, కరీంనగర్, హుస్నాబాద్, వరంగల్‌తోపాటు హైదరాబాద్ నుంచి కూడా ఫకీర్‌షావలీ జాతరకు ప్రజలు తరలివచ్చి సమాధిని దర్శించుకుంటారు. ఎల్కతుర్తి నుంచి దామెరకు చేరుకొని అక్కడి నుంచి ఆటోల్లో 3కిలోమీటర్ల దూరంలో జాతర జరిగే గుట్ట వద్దకు వెళ్లవచ్చు.
ఫకీర్షావలీకి వయసు మీద పడి ఆరోగ్యం క్షీణించిన సమయంలో గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమవుతూ అతడు బాగుండాలని ప్రార్థనలు చేశారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న ఫకీర్ షావలీ తాను ఉగాది నాడు మరణిస్తానని, తన భౌతికకాయానికి ముస్లిం మతాచారం ప్రకారం అంత్యక్రియలు జరుపాలని గ్రామస్తులకు చెప్పారు. అన్నట్లుగానే ఆ రోజు ఫకీర్ షావలీ చనిపోవడంతో గ్రామస్తులు అతడి కోరిక ప్రకారమే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ముస్లిం సంప్రదాయం తెలియని గ్రామస్తులు వేరే ప్రాంతం నుంచి లాల్మహ్మద్ను తీసుకొచ్చి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమైన తరుణంలో మృతదేహం అదృశ్యమైందని, గ్రామస్తులంతా వెతికినా ఆచూకీ దొరుకలేదని, ఆ రోజే షావలీ కొందరి కలలోకి వచ్చి ‘ఊరి చివరి గుట్టపైనే ఉన్నాను’ అని చెప్పి అదృశ్యమయ్యాడని, దీంతో గుట్టపైకి వెళ్లి చూడగా ఫకీర్ సమాధి కనిపించిందని, అప్పటి నుంచి ఏటా ఉగాది నాడు ఇక్కడ జాతర నిర్వహిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.