అల వైకుంఠపురం ఇలకు దిగొచ్చినట్లు భక్తి పారవశ్యం ఉప్పొంగింది. దీప కాంతులు విరజిమ్ముతుండగా.. వేద మంత్రోచ్ఛారణలు మార్మోగుతుండగా.. ఉత్తర ద్వార దర్శనం నేత్రపర్వంగా సాగింది. భద్రాద్రి ఆలయ ప్రాంగణంలో బుధవారం అర్ధరాత్రి నుంచే అర్చకులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. గురువారం తెల్లవారుజామున ఆంతరంగికంగా ముక్కోటి ఉత్తర ద్వార దర్శన వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. గరుడ వాహనంపై శ్రీరాముడు, గజ వాహనంపై సీతమ్మ, హనుమద్ వాహనంపై లక్ష్మణమూర్తి, ఆండాళ్ తల్లి, భగవద్రామానుజుల వారు చెరో వాహనంపై ఉత్తర ద్వారంలో దర్శనమివ్వడంతో భక్తులు తరించిపోయారు. అనంతరం గరుడ వాహనంపై ఉన్న రాములోరిని తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. పట్టణంలో తిరువీధి సేవ నిర్వహించి ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. రామయ్య, సీతమ్మ, లక్ష్మణ స్వామివారిని అంతరాలయంలోకి తీసుకెళ్లారు.
భద్రాచలం, జనవరి 13: గుడి గంటలు మోగుతుండగా.. దీప కాంతులు ప్రజ్వరిల్లుతుండగా.. సాంబ్రాణి ధూపం పరమళిస్తుండగా.. వేద మంత్రోచ్ఛారణలు ప్రతిధ్వనిస్తుండగా ఉత్తర ద్వార తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి.. ఒక్కసారిగా మంత్రోచ్ఛారణలు మిన్నంటాయి. గరుడ వాహనంపై శ్రీరాముడు, గజ వాహనంపై సీతమ్మ, హనుమద్ వాహనంపై లక్ష్మణమూర్తి, ఆండాళ్ తల్లి, భగవద్రామానుజుల వారు చెరో వాహనంపై ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. అల వైకుంఠపురం ఇలకు దిగివచ్చినట్లు అందరి మనసుల్లో భక్తి పారవశ్యం నిండింది. ఈ వేడుకకు భద్రాచలంలోని భద్రాద్రి రామాలయ సన్నిధి వేదికైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ అధికారులు వేడుకలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ఆంతరంగికంగా ముక్కోటి ఉత్తర ద్వార దర్శన వేడుక నిర్వహించారు.
అర్ధరాత్రి నుంచే పూజలు..
బుధవారం అర్ధరాత్రి నుంచే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, ఆరాధన, నివేదన, సేవాకాలం చేపట్టారు. చతుర్వేదాలు, ద్రవిడ ప్రబంధాలు, ఇతిహాసాలు, శరణాగతి, గద్య, గరుడ దండకం, దాశరథి శతకం పఠించారు. వైకుంఠ రాముడికి 108 వత్తులతో హారతి, మంగళాశాసనం సమర్పించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం నిర్వహించారు. వాగ్గేయకారుడు భక్త రామదాసు తహసీల్దార్‌గా ఉన్నప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.
ఆలయ అధికారులు భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్‌యాదవ్ స్వామివారికి ప్రథమ అలంకార భాగ్యాన్ని ఇచ్చారు. ప్రథమ దర్శనం కల్పించారు. ఆలయ ఈవో బానోత్ శివాజీ తహసీల్దార్‌కు రామయ్య శేషవస్ర్తాలు, శేష మాలికలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్న పుణ్యం వస్తుందని ఆస్థాన స్థానాచార్యుడు కేఈ స్థలశాయి అన్నారు. అనంతరం అధికారులు, అర్చకులు స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించారు. పట్టణంలోని ఆలయ ప్రాంగణం నుంచి తాత గుడి సెంటర్ వరకు ఈ ఊరేగింపు సాగింది. కార్యక్రమాలకు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కుటుంబ సమేతంగా హాజరయ్యారు. వేడుకల్లో అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఇంటెలిజెన్స్ సీఐ హరిసింగ్ రాథోడ్ పాల్గొన్నారు. పట్టణ సీఐ టీ స్వామి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం
అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలను విజయవంతం చేశామని భద్రాచలం ఇన్చార్జి సబ్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈవో బానోత్ శివాజీ, ఇతర ఆలయ అధికారులు, అర్చకులు విజయవంతంగా ఉత్తర ద్వార దర్శన వేడుక పూర్తి చేశారన్నారు. పోలీసుశాఖ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు నిర్వహించిందన్నారు. వేడుకల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేశామన్నారు.
పర్ణశాలలో..
పర్ణశాల, జనవరి 13: దుమ్ముగూడెం మండలం పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో గురువారం తెల్లవారుజామున నిరాడంబరంగా ముక్కోటి ఏకాదశి పూజలు జరిగాయి. స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. అర్చకులు వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం అధికారులు వేద మంత్రోచ్ఛారణ, మేళ తాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు కొవిడ్ నిబంధనలు అనుసరించి వేడుకలు చేపట్టారు. కార్యక్రమాల్లో ఏఈవో భవానీ రామకృష్ణ, ఆలయ సూపరింటెండెంట్ కిశోర్, దుమ్ముగూడెం సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై రవికుమార్, ఆలయ ఇన్చార్జి ప్రసాద్, ఆర్ఐ ఆదినారాయణ పాల్గొన్నారు.