కొండాపూర్, మియాపూర్ :నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణకు ఎంపికైన గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్‌కు చెందిన పీ శశాంక్ యాదవ్‌కు హోప్ ఫౌండేషన్ ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించింది. బుధవారం ఫౌండేషన్ సభ్యులు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ చేతుల మీదుగా రూ. 10వేల ప్రోత్సాహకాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావడం సంతోషంగా ఉందన్నారు. హోప్ ఫౌండేషన్ అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా క్రీడాకారులకు సూచించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 6 వారాల పాటు కొనసాగే శిక్షణలో మరింత మెరుగ్గా తయారవ్వాల్సిందిగా శశాంక్‌కు తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే స్విమ్మింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించి పతకాలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండ విజయ్ కుమార్, మాదవరం రంగారావు, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.