యాదాద్రి, ఏప్రిల్ 5 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ మంగళవారం ఆకుపూజ చేశారు. స్వయంభువుల క్షేత్రానికి పాలకుడిగా క్యూకాంప్లెక్స్‌లో గల క్షేత్రపాలకుడి ఆలయంలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేదమంత్రాల నడుమ జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. లలితాపారాయణము చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పంచనారసింహుడికి నిత్యపూజలు ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలు నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు జరిగాయి. సాయంత్రం అలంకార సేవోత్సవాన్ని సంప్రదాయంగా జరిపించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామి, అమ్మవారల ఆశీస్సులు అందజేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలు నిరాటకంగా కొనసాగాయి. భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తూ ఆలయ పునర్నిర్మాణాలను తనివితీరా పరిశీలించారు. స్వామివారి సువర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామివారి ఆర్జిత పూజల కోలాహలం నెలకొన్నది. స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని వేడుకను తిలకించారు. శ్రీవారి ఖజానాకు రూ.15,37,620 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామివారి అనుబంధ ఆలయం పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి బాలాలయంలో సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు మంగళవారం నాలుగో రోజు కొనసాగాయి. ఆలయ పురోహితులు చరమూర్తులకు నిత్యారాధనలు, రామమానస పూజ, ప్రాతఃకాల మధ్యాహ్నిక పూజలు శైవ సంప్రదాయ రీతిలో జరిపారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 71,050
వేద ఆశీర్వచనం 6,000
నిత్య కైంకర్యాలు 2,400
సుప్రభాతం 3,300
క్యారీ బ్యాగుల విక్రయం 20,000
వ్రత పూజలు 1,08,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 29,600
ప్రసాద విక్రయం 10,14,000
వాహన పూజలు 5,800
అన్నదాన విరాళం 3,950
సువర్ణ పుష్పార్చన 1,56,00
యాదరుషి నిలయం 64,540
లక్ష్మీ పుష్కరిణి 200
ఆంజనేయస్వామి ఆలయం 800
పాతగుట్ట నుంచి 51,580