
నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార యూనియన్( నార్ముల్) పాడి రైతులకు శుభవార్త చెప్పింది. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కొత్త పాలక వర్గం ప్రభుత్వ సూచన మేరకు రైతాంగానికి తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం ఉన్న పాల సేకరణ, వెన్న రేట్లను సైతం పెంచుతున్నట్లు గురువారం నిర్ణయం తీసుకున్నది. గేదె పాలకు వెన్న శాతాన్ని బట్టి రూ. రెండు నుంచి ఆరుకు, ఆవు పాలకు రూ.2.60 నుంచి రూ.3.20కి పెంచుతూ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి తెలిపారు. గేదె వెన్న కిలోకు రూ. 60 పెంచగా ఆవు వెన్న కిలోకి రూ.25 పెంచారు. ఈ పెంచిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
పాడి రైతాంగం సంక్షేమాన్ని దృష్టిలో పెటుకొని నార్ముల్ సంస్థ ఈ ఏడాది నుంచి పాలు, వెన్న ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న రేట్లను సవరిస్తూ ప్రస్తుతం పెంచిన రేట్లతో ఉత్తర్వులు విడుదల చేసింది. సాధారణంగా గేదె పాలల్లో వెన్న శాతం ఉంటుండగా గతంలో లీటరుకు ఐదు శాతం ఉంటే రూ.32.20 ఇవ్వగా పది శాతం ఉంటే రూ.68.40 ఇచ్చేవారు. ప్రస్తుతం ఐదు నుంచి పది శాతం వరకు గత రేట్ల కంటే రెండు రూపాయలు అదనంగా ఇవ్వనుండగా పది శాతానికి మించితే ఆరు రూపాయల వరకు చెల్లించనున్నారు. ఇక ఆవు పాలల్లో మూడు నుంచి 4.5శాతం వరకు వెన్న శాతం ఉంటుంది. గతంలో మూడు శాతం ఉంటే లీటరుకు రూ.28.11 ఇవ్వగా ఇక నుంచి రూ.2.60 పెంచి రూ.30.71 ఇవ్వనున్నారు. అదే వెన్న శాతం 4.5శాతం ఉంటే గతంలో లీటరుకు రూ.31.50 దానికి మరో రూ.3.20 కలిపి రూ.34.71 చెల్లించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నార్మూల్ సంస్థ్దకు సంబంధించి 35,250 మంది రైతులు ఉన్నారు. గతంలో ప్రభుత్వం పెంచిన రూ.4 ప్రోత్సాహకం త్వరలో ఇవ్వనున్నట్లు నార్మూల్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి తెలిపారు
గేదె పాలు (లీటరు)
గతంలో 5శాతం పైన ఉంటే రూ. 32.20
ప్రస్తుత పెరిగిన రేటు రూ.34.20
గతంలో 10శాతం పైన ఉంటే రూ.68.40
ప్రస్తుతం పెరిగిన రేటు రూ.74.40
ఆవు పాలు
గతంలో 3శాతం పైన ఉంటే రూ. 28.11
ప్రస్తుతం పెరిగిన రేటు రూ.30.71
గతంలో 4.5శాతం పైన ఉంటే రూ.31.51
ప్రస్తుతం పెరిగిన రేటు రూ. 34.71
గేదె వెన్న కిలో గతంలో రూ. 630
ప్రస్తుతం రేటు రూ.690
ఆవు వెన్న కిలో గతంలో రూ. 245
ప్రస్తుత రేటు రూ.270