నిర్మల్ టౌన్, ఏప్రిల్ 4 : జిల్లాల్లో ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలో వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్మల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీపీవో వెంకటేశ్వర్రావు హాజరయ్యారు. జిల్లాలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఓటరు ముసాయిదా జాబితాను సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయా ఓటరు జాబితాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. ఏప్రిల్ 21 నాటికి ఓటరు జాబితాను సిద్ధం చేయాలన్నారు. 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నా రు. నిర్మల్ జిల్లాలో 11 స్థానాలు, 217 వార్డు వా ర్డు స్థానాలు, 3 ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వడదెబ్బ తగలకుండా కనీస జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన మాట్లాడారు. జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు చేరుకున్నాయన్నారు. ప్రజలను చైతన్యం చేయాలని వాతావరణశాఖ సూచించినట్లు చెప్పారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దన్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ దవాఖానలో చికిత్స తీసుకోవాలన్నారు. ఉపాధి పనులను ఉదయం11 గంటల్లోపే పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ప్యాకె ట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వేసవి నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు.