కమలం పార్టీలో కల్లోలం రేగుతున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఇలాకాలో అసంతృప్తి సెగ రాజుకుంటున్నది. ఆ పార్టీ నాయకత్వంపై తిరుగుబావుటా ఎగరేస్తూ బుధవారం కరీంనగర్లో నిర్వహించిన సమావేశం హాట్ టాపిక్‌గా మారింది. అందులో చర్చించిన అంశాలపై ‘కరీంనగర్ బీజేపీలో కుదుపు’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ప్రధాన సంచికలో గురువారం ప్రచురితమైన కథనం కాక పుట్టించింది. సమావేశం నిర్వహించిన పలువురు నాయకులకు రాష్ట్రస్థాయి నేతలు వరుస పెట్టి ఫోన్లు చేసినట్లుగా, అందులో మెజార్టీ నేతలు తాము సైతం కలిసి వస్తామని చెప్పినట్లుగా.. కొంత మంది మాత్రం ఏం జరిగిందంటూ ఆరా తీసినట్లుగా తెలుస్తున్నది. పత్రికలో వచ్చింది వాస్తవమేనా..? అని కొంత మంది అడగ్గా, ‘మీటింగ్‌లో జరిగిందే వాళ్లు రాశారు. అందులో ప్రతీది అక్షర సత్యం’ అని సదరు నేతలకు తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలోని అనేక మంది సీనియర్లు సైతం కరీంనగర్ జిల్లా నాయకుల అభిప్రాయంతో ఏకీభవించడమే కాదు, తమ జిల్లాల్లోనూ వివక్షకు గురవుతున్న నాయకులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పినట్లు తెలుస్తున్నది.
కరీంనగర్, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్లో బుధవారం (ఈ నెల 12వ తేదీ) జరిగిన పాతవర్గం బీజేపీ నాయకుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో చర్చించిన అంశాలపై ‘కరీంనగర్ బీజేపీలో కుదుపు’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ప్రధాన సంచికలో గురువారం ప్రచురితమైన కథనం ఆ పార్టీలో కాక పుట్టించింది. సమావేశం నిర్వహించిన పలువురు నాయకులకు రాష్ట్ర స్థాయి నేతలు వరుస పెట్టి ఫోన్లు చేసినట్లుగా, అందులో మెజార్టీ నాయకులు ‘మేం సైతం’ కలిసి వస్తామని చెప్పగా.. కొంత మంది మాత్రం ‘ఏం జరిగింది’ అంటూ ఆరా తీసినట్లుగా తెలుస్తున్నది. ‘నమస్తే తెలంగాణ’లో వచ్చింది వాస్తవమేనా..? అని కొంత మంది ఆరా తీయగా, ‘మీటింగ్‌లో జరిగిందే వాళ్లు రాశారు. అందులో ప్రతీది అక్షర సత్యం’ అని సదరు నాయకులకు తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో రాష్ట్రంలోని అనేక మంది సీనియర్ నాయకులు సైతం కరీంనగర్ జిల్లా నాయకుల అభిప్రాయాలతో ఏకీభవించడమే కాదు, తమ జిల్లాల్లోనూ వివక్షకు గురవుతున్న నాయకులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపినట్లు తెలుస్తున్నది. అంతేకాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒంటెత్తు పోకడ.. సొంత జిల్లాలో అతను అనుసరిస్తున్న తీరు, సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలను విస్మరిస్తున్న తీరు.. వంటి అనేక విషయాలను ఫోన్లు చేసిన రాష్ట్ర నేతలకు కరీంనగర్ నాయకులు వివరించినట్లుగా కొంత మంది సీనియర్లు తెలిపారు. మన పార్టీలో ఇలా కొట్లాడుకుంటే అధికారంలోకి ఎలా వస్తామని ఒక బీజేపీ రాష్ట్ర నాయకుడు ఫోన్లో మాట్లాడగా, కొంత మంది సీనియర్లు సీరియస్‌గా సమాధానమిచ్చినట్లు చెబుతున్నారు. కొత్తగా వచ్చిన మీరంతా అధికారం, స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని, పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారని, కానీ, తాము మాత్రం తమ ఆత్మగౌరవంతోపాటు పార్టీ సిద్ధాంతపరంగా ముందుకెళ్తున్నామని ఘాటుగా సమాధానమిచ్చినట్లు సమాచారం. ఇంకా ‘పార్టీ ముందుకెళ్లాలంటే.. ఒకరిద్దరిని ఇష్టారాజ్యంగా విమర్శిస్తే సరిపోతుందా? అసలు ఎజెండా లేకుండా మాట్లాడితే ఎలా..? ఏది మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలి.. ఏ అంశంపై మాట్లాడాలి.. అన్న చర్చ ఏనాడైనా పార్టీలో జరుగుతున్నదా..? ఒంటెత్తు పోకడ ప్రదర్శిస్తే ఎలా..? అసలు మనపార్టీలో కొంత మంది మాట్లాడుతున్న తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఎలా మదన పడుతున్నారు? ఏమనుకుంటున్నారో ఏనాడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. అంతేకాదు, జాతీయ పార్టీగా కార్యకర్తల సంక్షేమానికి ఏం చేస్తున్నారు? ఎన్నికలు లేదా కార్యక్రమాలున్నప్పుడు రెచ్చగొట్టడం, వాడుకోవడం, ఆ తర్వాత వదలేయడమేనా..? ఏనాడైనా వారిని పట్టించుకున్నారా? ఇది వాస్తవం కాదా..? అని మమ్మల్ని కార్యకర్తలు అడుగుతున్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై లేదా..? అని రాష్ట్ర నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. అంతెందుకు కరీంగనర్ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఏనాడైనా కార్యకర్తల గురించి పట్టించుకున్నారా..? కనీసం వారితో మీటింగ్ పెట్టి.. వారి సాధకబాధకాలు విన్నారా..? వారి సంక్షేమం కోసం ఏమైనా చేశారా? వీటిపై ‘ముందుగా రాష్ట్ర అధ్యక్షుడు సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించినట్లు సమాచారం. ఆది నుంచీ పార్టీ కోసం పనిచేసిన తమ పరిస్థితి అలాగే ఉన్నదని, చాకిరీ చేయించుకోవడం వదిలేయడం పార్టీలో ఒక అలవాటుగా మారుతున్నదని, దీని వల్ల తమ ఉనికే ప్రశ్నర్థకంగా మారుతున్నదన్న ఆందోళనతోనే తాము మీటింగ్ పెట్టుకున్నామని సీనియర్లు చెప్పినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర స్థాయి నేతలతోపాటు పలు జిల్లాల నుంచి భారీగా ఫోన్లు వచ్చినట్లుగా కొంతమంది కరీంనగర్ జిల్లా నాయకులు తెలిపారు. అన్ని జిల్లాల్లో బీజేపీ పాత తరం వర్గంలో అసంతృప్తి నెలకొన్నదని, కొత్త వారికి ఎర్రతివాచీలు పరిచి, పాత వారిని అగౌరవ పరుస్తున్నారని, అందుకే కరీంనగర్ తరహాలోనే తాము కూడా మీటింగ్ పెట్టుకుంటామని చెప్పినట్లు సమాచారం. పార్టీని బతికించుకోవాలన్న.. పార్టీ కోసం ముందు నుంచీ పనిచేసిన వారికి ఆత్మగౌరవం నిలువాలన్న.. జరుగుతున్న తప్పులు, పార్టీ వెళ్తున్న పక్కదారులపై పార్టీ నిబంధనలకు లోబడి తిరుబాటు చేయాల్సిందేనన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో తాడే పేడో తేల్చుకోవడానికి సిద్ధమన్న అభిప్రాయం సైతం వ్యక్తమైందని కొంతమంది సీనియర్లు తెలిపారు. ఒంటెత్తు పోకడలతో పార్టీ పక్కదారి పట్టడమే కాదు.. వారి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని, ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వచ్చిన పార్టీని, పార్టీనే నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు, శ్రేణులను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని, దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేసినట్లు తెలుస్తున్నది. అంతేకాదు.. వేర్వేరు జిల్లాల్లో జరిగే మీటింగ్‌లకు కరీంనగర్ జిల్లాలో మీటింగ్ నిర్వహించిన సీనియర్ నాయకులు హాజరు కావాలని కోరినట్లు కొంతమంది నాయకులు తెలిపారు.
ఇప్పుడు గుర్తుకొచ్చామా..?
దశాబ్ధాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నామని, పార్టీలో ఈ మధ్యకాలంలో కొత్త పోకడలు చూస్తున్నామని, తమ గురించి ఏ రోజైనా పట్టుంచుకున్నారా..? మా జిల్లా నుంచి ఉన్న రాష్ట్ర అధ్యక్షుడే మాకు కనీస సమాచారం ఇవ్వకుండా ఒంటెత్తు పోకడతో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. ఆ రోజు మేం గుర్తుకు రాలేదా..? ఈ విషయంపై పలుసార్లు పలు రకాలుగా అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఏనాడు ఎవరైనా పట్టించుకున్నారా..? అంటూ సీనియర్లు ప్రశ్నించినట్లుగా తెలుస్తున్నది. తమ ఉనికే ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో.. పార్టీ సిద్ధాంతం కోసం మీటింగ్ పెట్టుకుంటే.. ఇప్పడు మాట్లాడుతున్నారా..? అంటూ వారి అవేదనను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తున్నది.
కలిసి కదం తొక్కుదాం..?
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని మీటింగ్ నిర్వహించారని, ఇక నుంచి జరిగే మీటింగ్‌లకు తమకు సమాచారం ఇస్తే.. కలసి కదం దొక్కుదామని పలువురు కార్యకర్తలు సైతం సీనియర్లతో తమ ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. ఏదో ఒక కార్యక్రమం పేరిట పిలుపునివ్వడం.. అక్కడ మేం ఇబ్బందులు పడడం.. ఆ తర్వాత అధినాయకత్వం చేతులు దులుపుకొని వెళ్లడం.. ఏమి ఇబ్బంది జరిగిందని ఆ తదుపరి మాట మాత్రం మాట్లాడక పోవడం.. ఫోన్లు చేస్తే ఎత్తకపోవడం వంటివే కాకుండా.. ఇన్నేళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తల సంక్షేమం కోసం పార్టీ ఎమైనా కార్యక్రమం చేపట్టిందా..? అని తమ గోడును వెల్లబోసుకున్నట్లు తెలుస్తున్నది. ఇతర పార్టీలు కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తోంటే.. బీజేపీ మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆక్రోషాన్ని వెల్లగక్కినట్లు తెలుస్తున్నది. ఇటు రాష్ట్ర నాయకులు, అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన మద్దతు, కార్యకర్తల ఆవేదనను పరిగణలోకి తీసుకొని.. త్వరలోనే మరో సమావేశాన్ని నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చినట్లు ఒక నాయకుడు తెలిపారు. అందులో తమ భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించాలని యోచించినట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి బండి సొంత జిల్లాలో తిరుబాటు మొదలు కావడంతో.. బీజేపీలో ఒక్కసారిగా అసంతృప్తిసెగలు బయట పడుతున్నాయి.