
కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి యుద్ధం ప్రకటించింది. వైరస్ వ్యాప్తి నివారణకు నడుం బిగించింది. కొవిడ్‌ను ఆదిలోనే గుర్తించి, బాధితులకు పూర్తిస్థాయిలో ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం నుంచి జ్వర సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రత్యేక సర్వే బృందాలను నియమించింది. ఒక్కో ఆశాకార్యకర్తకు పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, వీఆర్ఏ లేదా బిల్ కలెక్టర్, మల్టీపర్పస్ వర్కర్స్‌లో చదువుకున్న వారిలో ఒకరిని సహకారంగా నియమిస్తారు. ఒక్కో బృందం రోజుకు 50 ఇండ్లలో సర్వే చేయాల్సి ఉంటుంది. ఇంటింటికెళ్లి కుటుంబసభ్యుల ఆరోగ్య వివరాలు నమోదు చేయాలి. జ్వరం లేదా కొవిడ్ లక్షణాలున్న బాధితులను గుర్తించి వారికి మందులు ఇస్తారు. జ్వరం ఏడు రోజులకు మించి ఉన్నట్లయితే ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తారు. వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించనున్నారు.
ఖమ్మం సిటీ, జనవరి 20 : కరోనా థర్డ్ వేవ్ జెట్ స్పీడులో విస్తరిస్తున్నది. జనాల అలసత్వమే ఆలంబనగా సామాజిక వ్యాప్తి జరుగుతున్నది. నెల రోజుల క్రితం వరకు జీరోగా ఉన్న వైరస్.. వారం, పది రోజులుగా విజృంభిస్తున్నది. ప్రమాదకర పరిస్థితులను పసిగట్టిన తెలంగాణ సర్కారు మహమ్మారిపై మరోసారి యుద్ధానికి సిద్ధమైంది. కొవిడ్‌ను ఆదిలోనే గుర్తించి, బాధితులకు పూర్తిస్థాయిలో సాంత్వన చేకూర్చేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించింది. పకడ్బందీ అమలుకు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రెండు జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్ పర్యవేక్షణలో జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం నుంచి ఇంటింటికీ వెళ్లి కరోనా లక్షణాలు కలిగిన వారిని గుర్తించే సర్వేకు సమాయత్తమైంది.
ఒక్కో బృందానికి 50 ఇళ్లు..
కొవిడ్ మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఆదేశానుసారం ఉమ్మడి జిల్లా అధికారులు వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. దీనికిగాను జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే బృందాలను నియమించారు. ఒక్కో ఆశా వర్కర్‌కు అంగన్వాడీ టీచర్/ పంచాయతీ కార్యదర్శి/ వీఆర్వో/ వీఆర్ఏ/ బిల్ కలెక్టర్/ మల్టీపర్పస్ వర్కర్లలో చదువుకున్న వారిలో ఒకరిని సహకారంగా నియమిస్తారు. ఇద్దరినీ కలిపి ఒక బృందంగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో బృందం రోజుకు 50 ఇళ్లు సర్వే చేయాల్సి ఉంటుంది. అందరూ కలిసి వారికి కేటాయించిన ప్రాంతంలోని ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేయాలి. ఆ క్రమంలో జ్వరం లేదా ఇతర కొవిడ్ లక్షణాలున్న బాధితులను గుర్తిస్తారు. అవసరానికి తగ్గట్లుగా అక్కడే ఏడు రోజులకు సరిపడే మందులు అందిస్తారు. జ్వరం ఏడు రోజులకు మించి ఉన్నట్లయితే ఉన్నతాధికారులకు సమాచారం అందించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించి సేవలు అందించనున్నారు.
ముమ్మరంగా వ్యాక్సినేషన్..
భద్రాద్రి జిల్లా వైద్య సిబ్బంది మరో వైపు వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేశారు. ప్రికాషన్ డోస్ లక్ష్యం 44,118 కాగా.. 12,702 మందికి వేశారు. టీనేజర్ల టార్గెట్ 52,318 కాగా 44,776 మందికి వేశారు. రెండో డోస్ 1,38,232 కాగా 1,27,130 మందికి వేశారు. ఖమ్మం జిల్లాలో ఫస్ట్ డోస్ 2,932 మందికి, సెకండ్ డోస్ 10,273 మందికి, ప్రికాషన్ డోస్ 517 మందికి వేశారు.
ఖమ్మం జిల్లాలో 751 కరోనా కేసులు..
ఖమ్మం జిల్లాలో శుక్రవారం 6,986 మందికి కరోనా పరీక్షలు చేగాయ 751 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
గుర్తించే వ్యాధి లక్షణాలు..
ప్రతీ ఆశా వర్కర్ దగ్గర పల్స్ ఆక్సీమీటర్ తప్పకుండా ఉండాలి. వాటిని గ్రామ పంచాయతీలు సమకూర్చాలి. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే హోం ఐసోలేషన్ కిట్లు అందించాలి. వారిని ఏఎన్ఎంలు ప్రతిరోజూ పర్యవేక్షించాలి. మాస్క్ ఆన్ పాలసీపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. వ్యాక్సినేషన్లో భాగంగా రెండో డోస్, బూస్టర్ డోస్ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలి. ఇంటికి సర్వేకు వెళ్లిన బృందాలు సదరు ఇంటి నెంబర్, కుటుంబ సభ్యుల సంఖ్య, వారి పేర్లు, వయసు, మొబైల్ నెంబర్, దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నీరసం, ఛాతి నొప్పి వంటి లక్షణాలన్నింటినీ నమోదు చేస్తారు. పల్స్ ఆక్సీమీటర్ సాయంతో శరీర ఉష్ణోగ్రత, ఎస్పీవోటూ, కొవిడ్ టెస్ట్ రిపోర్ట్, వ్యాక్సినేషన్ స్థితి, బీపీ, షుగర్, ఆస్తమా, టీబీ, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని ప్రత్యేక ఫార్మాట్లో పొందుపరుస్తారు. కొవిడ్ లక్షణాలు కలిగిన వారికి హోం ఐసోలేషన్ కిట్లు అందించారా లేదా అనేది తప్పనిసరి.
మంత్రి, కలెక్టర్ల పర్యవేక్షణ..
ఉమ్మడి జిల్లాలో కరోనా మూడో దశ నియంత్రణకు నిర్వహించనున్న ఇంటింటి సర్వే వచ్చే బుధవారం నాటిని పూర్తి కావాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ రంగంలోకి దిగారు. కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్‌లతో చర్చించి సర్వే బృందాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ తరహా ప్రక్రియ కరోనా రెండో దశలో సత్ఫలితాలనిచ్చింది. అదే స్ఫూర్తితో మహమ్మారిపై మరోసారి యుద్ధం చేసేందుకు జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. కాగా, సర్వే బృందాలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచే ఇళ్లను సందర్శించాలి. ఎంతమంది జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, కిడ్నీ, గుండె, క్యాన్సర్ వంటి ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్నారో గుర్తించాలి. మధ్యాహ్నం 2 గంటల వరకు సమాచారాన్ని మండల వైద్యాధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలకు అందజేయాలి. అక్కడి నుంచి రిపోర్ట్ నేరుగా మంత్రి, కలెక్టర్లకు వెళ్తుంది. ఆ తర్వాత పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి తీసుకోవాల్సిన చర్యల గురించి వైద్యారోగ్యశాఖకు వారు దిశానిర్దేశం చేస్తారు. సర్వే విషయంలో ఎవరైనా అలసత్వం ప్రదర్శించినా, తప్పుడు నివేదికలు అందజేసినా కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతికి ఆదేశాలు అందాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో 700, పట్టణాల్లో 156 బృందాలను అందుబాటులో ఉంచారు.