కూసుమంచి/కూసుమంచి రూరల్, జనవరి 22 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్వర సర్వే మండలంలో 69 బృందాలతో ముమ్మరంగా కొనసాగుతున్నదని డీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబంలో ప్రతిఒక్కరినీ పరీక్షించారు. మండలంలోని మునిగేపల్లి, పాలేరు, జీళ్లచెరువు, నేలపట్ల, లోక్యాతండా, కోక్యాతండా, నాయకన్‌గూడెం గ్రామాల్లో సర్వేను శనివారం ఆయన పరిశీలించారు. జ్వరం, దగ్గు ఉన్నవారికి జాగ్రత్తలు సూచించి, మందులు పంపిణీ చేశారు. కొవిడ్ లక్షణాలు ఉన్న 56 మందికి కిట్లు అందజేశారు.
తిరుమలాయపాలెంలో..
తిరుమలాయపాలెం, జనవరి 22 : మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం జ్వరపీడితుల సర్వే కొనసాగిం ది. మొత్తం 18,535 కుటుంబాలకు ఇప్పటి వరకు 6479 కుటుంబాల్లో వైద్య సిబ్బంది సర్వే పూర్తిచేశారు. అందులో కరోనా లక్షణాలున్న 317 మంది జ్వరపీడితులను గుర్తించారు. వారికి మందుల కిట్లు అందజేశారు. ఇస్లావత్తండలో సర్వేను ఎంపీపీ మంగీలాల్, సర్పంచ్ ఇస్లావత్ అచ్చమ్మ చంద్రు, ఎంపీడీవో జయరామ్ పరిశీలించారు.
నేలకొండపల్లిలో..
నేలకొండపల్లి, జనవరి 22 : మండలంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేను శనివారం ఎంపీపీ వజ్జా రమ్య పరిశీలించారు. మండ్రాజుపల్లిలో ఎంపీపీ పలువురి నివాసాలకు వెళ్లి జ్వరాన్ని పరిశీలించారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి జ్వర వివరాలు నమోదు చేయాలన్నారు. లక్షణాలు ఉన్న వారికి మందుల కిట్లు పంపిణీ చేయాలన్నారు. పలు గ్రామాల్లో సర్వేను సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ నెల్లూరి అనురాధ, సీడీసీ చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, ఎంపీడీవో జమాల్‌రెడ్డి, వజ్జా శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బోనకల్లులో..
బోనకల్లు, జనవరి 22 : మండలంలోని 22 గ్రామాల్లో శనివారం రెండోరోజు జ్వర సర్వే నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు నిర్వహించి జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారికి ప్రభుత్వం సరఫరా చేసిన మందుల కిట్లు అందజేశారు. సర్వేను ఎంపీడీవో జీ.శ్రీదేవి, వైద్యాధికారులు పర్యవేక్షించారు.
మధిరలో..
మధిరరూరల్, జనవరి 22 : మున్సిపాలిటీ పరిధిలోని వార్డులు, మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం జ్వర సర్వే ముమ్మరంగా సాగింది. గ్రామాల్లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఆరోగ్య, ఐకేపీ, పంచాయతీ సిబ్బంది సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారికి కిట్లను అందించి సూచనలు చేశారు.
చింతకానిలో..
చింతకాని, జనవరి 22 : మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటి జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నదని ఎంపీడీవో బానోత్ రవికుమార్ అన్నారు. ఆయా గ్రామాల్లో కరోనా లక్షణాలు ఉంటే వెంటనే సర్వే బృందం బాధితులకు కొవిడ్ కిట్ అందిస్తున్నారు. ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎంల ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, ఆశా, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.