రైతన్నకు దన్నుగా టీఆర్ఎస్ చేస్తున్న వరి పోరు ఉధృతంగా సాగుతున్నది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా కేంద్రం కుట్రలను నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రాలు దద్దరిల్లాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కర్షకులతో కలిసి గులాబీ శ్రేణులు కదం తొక్కాయి. జిల్లా నలుమూలల నుంచి ఉప్పెనలా తరలిరావడంతో నిరసన దీక్షలు విజయవంతమయ్యాయి. చేతిలో వరి కంకులు, దిక్కులు పిక్కటిల్లే నినాదాలు తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తుకు తెచ్చాయి. నల్లగొండ క్లాక్‌టవర్ సెంటర్లో జరిగిన దీక్షలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, హోం మంత్రి మహమూద్‌అలీ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. సూర్యాపేట ఎదుట చేపట్టిన దీక్షకు మంత్రి గుంటకండ్ల నేతృత్వం వహించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్మన్లతోపాటు ముఖ్య నేతలంతా నిరసనల్లో పాల్గొని కేంద్రాన్ని తూర్పార పట్టారు. వడ్లు కొనే వరకూ సాగే పోరాటంలో కలిసి నడుద్దామని ప్రతిన బూనారు. కేంద్ర సర్కారు తీరును నిరసిస్తూ అన్నదాతకు మద్దతుగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇండ్లపైన నల్లజెండాలు ఎగురవేయాలని, క్షేత్రసాయిలో నిరసనలు చేపట్టాని మంత్రి జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
అన్నదాతకు అండగా నిలుద్దాం అల్లకల్లోలంగా కేంద్ర ప్రభుత్వ పాలన ధాన్యం కొనే వరకూ పోరాటం ఆగదు
రైతులు పండించిన వడ్లు కొనకుండా ఆహార భద్రత చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తున్నది. బీజేపీ సర్కారు చేతగానితనం వల్లే అన్నదాతలు బాధపడుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మాటలు మార్చి దొంగాట ఆడుతున్నది. వరి వేయండి.. కొంటాం అన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ రోజు మొహం చాటేసింది. సీఎం కేసీఆర్ ఉండగా అన్నదాతలకు నష్టం జరుగదు. టీఆర్ఎస్ అంటేనే రైతుల పార్టీ. రైతుల కోసమే పుట్టిన పార్టీ. ఒకనాడు నీళ్ల కోసం గోస పడిన ఉమ్మడి నల్లగొండ జిల్లా నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది.
అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపిన సీఎం కేసీఆర్‌ను చూస్తే కేంద్రానికి లాగులు తడుస్తున్నాయి. ఆ కంటగింపుతోనే రైతుల జీవితంతో చెలగాటం ఆడుతున్నది. కేంద్రం మెడలు వంచే దాకా టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమం ఆగదు. రాష్ట్ర రైతాంగానికి చిన్న నష్టం కూడా రానివ్వం. కేంద్ర సర్కారు తీరును నిరసిస్తూ అన్నదాతకు మద్దతుగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతి ఇంటిపై నల్లజెండాలు ఎగురవేయాలి. క్షేత్రసాయిలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టాలి.
వరి కంకులతో బిగిసిన పిడికిళ్లు హోరెత్తిన నినాదాలు.. ఉద్యమ రోజులను తలపించిన ఆందోళన సూర్యాపేట, నల్లగొండలో నేతృత్వం వహించిన మంత్రి జగదీశ్‌రెడ్డి మోడీది దుష్మాన్ సర్కార్ అన్న హోంమంత్రి మహమూద్‌అలీ బీజేపీ సర్కారు మోసపూరిత విధానాలపై నేతల మండిపాటు నేడు గ్రామాల్లో నిరసనలకు పిలుపు
యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జిల్లా కేంద్రంలో గురువారం రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసన దీక్ష విజయవంతంగా జరిగింది. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులతో దీక్షా ప్రాంగణం దద్దరిల్లింది. అన్నదాతకు వ్యతిరేకంగా మోదీ సర్కారుకు అనుసరిస్తున్న విధానాలను నేతలు ఎండగట్టారు. రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలతో హోరెత్తించారు. ‘పంజాబ్‌లో వడ్లు కొంటున్న కేంద్రం తెలంగాణలో ఎందుకు కొనదు.. రైతులపై ఎందుకీ కక్ష’ అంటూ మండిపడ్డారు. వడ్లు కొనేదాకా వదలం.. నిరసనలు, ఆందోళనతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు.