నిర్మల్ టౌన్, ఏప్రిల్ 7 : స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా సర్కారు ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. త్వరలో ఖాళీగా ఉన్న సర్పంచ్‌తో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఉప ఎన్నికల ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి సూచించడడంతో జిల్లాలో కసరత్తు ప్రారంభమైంది. జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాల్లో ఓటర్ల డ్రాప్టు ముసాయిదాను నిర్వహించాలని ఆదేశించడంతో కసరత్తును ముమ్మరం చేశారు. ఈనెల 8 నుంచి 21 వరకు అన్ని జిల్లాల్లో ఓటర్ల ముసాయిదా జాబితా డ్రాప్టు నోటిఫికేషన్‌ను ఆయా ప్రాంతాల్లో అతికించి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించడంతో జిల్లా పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1507 సర్పంచ్ స్థానాలుండగా..ఇప్పటివరకు 40 సర్పంచ్‌స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాల్లో 568 స్థానాలకుగాను 12 ఖాళీగా ఉన్నాయి. ఇందులో నిర్మల్‌లో 11, ఆదిలాబాద్‌లో 8, మం చిర్యాలలో 9, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 12, వార్డు సభ్యుల స్థానాల్లో నిర్మల్- 217, ఆదిలాబాద్- 224, మంచిర్యాల-367, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 512 ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎంపీటీసీ స్థానాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. నిర్మల్‌లో 3, ఆదిలాబాద్‌లో 2, మంచిర్యాలలో 2, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్‌లో ఒక జడ్పీటీసీ స్థానం మాత్రమే ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ ప్రాంతాల్లో ఎన్నికల డ్రాప్టు ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు. మూడేళ్ల క్రితం సర్పం చ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారు అనారోగ్య కారణాల రీత్యా మృతి చెందినా, లేదా ఇతర కారణాలతో రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్తగా ఎన్నుకోవాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల ముసాయిదా జాబితాను శుక్రవారం అన్ని ప్రాంతాల్లో జిల్లా పంచాయతీ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ జాబితాను ఆయా పంచాయతీల్లో ఎంపీటీసీ స్థా నాల్లో అతికించనున్నారు. 12న రాజకీయ పార్టీలతో, 13న మండలస్థాయిలో ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 11 నుంచి 16 వరకు ఓటర్ల జాబితాలో ఉన్న అభ్యంతరాలను స్వీకరించి 19న పరిష్కరిస్తారు. ఈనెల 21న తుది ఓటరు జాబితాను ప్రకటించేలా జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోనున్నా రు. అన్ని జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై జోరుగా చర్చ సాగుతున్నది. ఈ ముసాయిదా అధికారికంగా విడుదలైన నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్న సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సభ్యుల స్థానాలకు ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండడంతో ఆశావహులు ఇప్పటి నుంచే ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.
ప్రభుత్వ ఆదేశాలతో ముందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలను సంబంధించిన ఓటరు జాబితా ముసాయిదాను అధికారికంగా షెడ్యూల్ విడుదల చేశాం. ఈనెల 8 నుంచి 21 వరకు ఓటరు జాబి తా విడుదల, అభ్యంతరాల తొలగింపు, రాజకీయ పార్టీల సమావేశం, 21న తుది జాబితాపై ప్రకటన అధికారికంగా వెలువడనుంది. ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో జిల్లాలో ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం.
వెంకటేశ్వరరావు, డీపీవో నిర్మల్
నిర్మల్‌లోని ఈవీఎం గోదామును కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ గురువారం పరిశీలించారు. గోదాం భవనానికి వెళ్లిన కలెక్టర్ స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతినెలా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, తహసీల్దార్ శివప్రసాద్ ఉన్నారు.