
సరదాల సంక్రాంతి సంతోషాలు మాత్రమే పంచాలి.. తెలిసీ ఆందోళనకర అంశాలను చేతులారా ఆహ్వానించవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ రూపంలో చాపకింద నీరులా కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో పండుగ పూట మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు పల్లెలకు వస్తున్న నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాలకు వైరస్ విస్తరించవచ్చని భావిస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలంటునారు. ఇదే సమయంలో ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సరిపడా టెస్టింగ్ కిట్లను అందుబాటులో ఉంచి, విస్తృతంగా పరీక్షలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీనేజర్లకు వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది.
నల్లగొండ ప్రతినిధి, జనవరి12(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 1 నుంచి బుధవారం నాటికి 33,963 టెస్టులు నిర్వహించగా 498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతనెలలో ఈ స్థాయిలో కేసులు రాలేదు. నల్లగొండ జిల్లాలో మొత్తం 15,136 టెస్టులు నిర్వహించగా 188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 9,494 టెస్టులు చేయగా 137 కేసులు, యాదాద్రి జిల్లాలో 9,333 టెస్టులు చేపట్టగా 173 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. నల్లగొండ జిల్లాలో మొత్తం 142 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 136 మంది హోమ్ఐసొలేషన్లో ఉన్నారు. ఆరుగురు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. సూర్యాపేట జిల్లాలోనూ 142 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరిగాయి. ఈ నెల 10న నల్లగొండలో 24, యదాద్రిలో 39కేసులు, 11న నల్లగొండలో 49, యదాద్రిలో 42, 12న నల్లగొండలో 28, యాదాద్రిలో 43 కేసులు నమోదయ్యాయి.
అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ
పెరుగుతున్న కేసుల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కూడా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. అవసరమైన టెస్టింగ్ కిట్లతో పాటు ఐసొలేషన్ కిట్లను సైతం జిల్లాలకు చేరవేశారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 1.90 లక్షల టెస్టింగ్, 60వేల ఐసొలేషన్ కిట్స్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. సూర్యాపేటలోనూ అవసరమైనన్నీ సిద్ధం చేశారు. ఐసీఎంఆర్ ఆదేశాలకు అనుగుణంగా రోజు వారీ టెస్టుల సంఖ్యను కూడా భారీగా పెంచారు. బుధవారం ఒక్కరోజే నల్లగొండలో 2916 టెస్టులు, యాదాద్రిలో 1165, సూర్యాపేటలోనూ వెయ్యికి పైగా టెస్టులు నిర్వహించారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెంచనున్నారు.
మరింత అప్రమత్తత అవసరం
సంక్రాంతి పండుగ వేళ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందేనని వైద్యారోగ్య శాఖ హెచ్చరిస్తున్నది. పండుగకు వేర్వేరు ప్రాంతాల వారు సొంతూళ్లకు చేరుకుంటారు. దాంతో వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పట్నాల నుంచి పల్లెలకు వస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోకతప్పదు. ఏ మాత్రం అనుమానం వచ్చిన పరీక్షలు చేయించుకొని హోంఐసోలేషన్ కావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తూ పాజిటివ్ వచ్చినా అంత ప్రమాదకరమేమి కాదని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
కొనసాగుతున్న వాక్సినేషన్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సాధారణ వాక్సినేషన్‌తోపాటు టీనేజర్లకు కూడా టీకా వేస్తున్నారు. బుధవారం వరకు నల్లగొండ జిల్లాలో 45,118 మంది టీనేజన్లకు వ్యాక్సిన్ వేశారు. యాదాద్రి జిల్లాలో 28,317 మందికి పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లాలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతుంది. బూస్టర్ డోసులకు సంబంధించి నల్లగొండ జిల్లాలో 3,119 మందికి, సూర్యాపేటలో 1,492 మందికి, యాదాద్రి జిల్లాలో 1,379 మందికి వ్యాక్సిన్ పూర్తి చేశారు. తొలి విడుతలో వైద్యసిబ్బందితో పాటు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోస్ ఇస్తున్నారు.