మెహిదీపట్నం : అన్నతో గొడవ పడ్డ ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన భార్య ఇరుగుపొరుగు వారిని కేకలు వేసి పిలిచింది. వారెవ్వరూ స్పందించక పోవడంతో 100 డయల్‌కు కాల్చేసింది.
వెంటనే స్పందించిన పోలీసులు నిమిషాలలో అక్కడికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి ఉరివేసుకున్న వ్యక్తిని కిందకు దించి సఫర్యలు చేసి చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. కొన ఊపిరితో ఉన్న అతడిని డాక్టర్లు చికిత్స చేసి బతికించారు. ఈ సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది.
ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ నాగం రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం……ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరుకు చెందిన శివరాజ్ (40) తన భార్య రాధతో మెహిదీపట్నం రేతిబౌలి సమీపంలోని షాలిమార్ స్వీట్స్ షాప్ వెనుక బస్తీలో నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా శివరాజ్‌కు తన అన్నతో ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
గొడవల కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురి అయిన శివరాజ్ మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి గది లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని ఉరివేసుకున్నాడు. గది బయట ఉన్న భార్య రాధ కేకలు వేసి ఇరుగుపొరుగు వారిని పిలిచినా ఎవరూ స్పందించకపోవడంతో డయల్ 100కు ఫోన్ చేసింది.
స్పందించిన ఆసిఫ్‌నగర్ పోలీసులు 5 నిముషాలలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రొబేషనరీ ఎస్ఐ సందీప్‌కుమార్, పెట్రో కార్-1 సిబ్బంది హరీష్, సంతోష్ కుమార్, జి.సురేష్‌లు తలుపులు బద్దలు కొట్టి శివరాజ్‌ను కిందకు దించారు.
ఈ క్రమంలో కానిస్టేబుల్ బి. హరీష్ చాకచక్యంగా వ్యవహరించి సీపీఆర్ ప్రక్రియ ద్వారా శివరాజ్‌ను ఆపస్మారక స్ధితి నుంచి బయటకు తెచ్చారు.అనంతరం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు స్పందించిన తీరుపై ఉన్నతాధికారులు వారిని ప్రశంసించారు.