నూతన జోనల్ విధానం ప్రకారం ఉమ్మడి జిల్లాకు ఉద్యోగుల కేటాయింపు
జాయినింగ్ రిపోర్టు ఇస్తున్న వివిధ శాఖల సిబ్బంది
అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు
వికారాబాద్ జిల్లాలో గురువారం ఒక్కరోజే 1103 మంది చేరిక
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 1495 మంది..
పరిగి, డిసెంబర్ 24 : కొత్త జిల్లాలు, నూతన జోనల్ విధానం ఆధారంగా ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సర్దుబాటుకు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు పూర్తికాగా.. వారు తమ జాయినింగ్ రిపోర్ట్‌ను సంబంధిత శాఖల అధికారులకు అందజేసి విధుల్లో చేరుతున్నారు. రెండు రోజుల్లో జాయినింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అత్యధికంగా విద్యాశాఖ పరిధిలోని ఉపాధ్యాయులు విధుల్లో చేరుతున్నారు. వికారాబాద్ జిల్లాలో గురువారం ఒక్కరోజే 1103 మంది జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జాయినింగ్ రిపోర్టులు అందజేశారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం వరకు 1495 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరారు.
జిల్లాల సర్దుబాటులో భాగంగా ఉద్యోగులు కోరుకున్న మేరకు వికారాబాద్ జిల్లాకు కేటాయించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు జిల్లాలో చేరుతున్నారు. ఈ మేరకు తమ జాయినింగ్ రిపోర్ట్‌ను ఆయా శాఖల అధికారులకు అందజేశారు. కొత్తగా జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లాల వారీగా ఉద్యోగుల విభజనకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జోనల్, మల్టీజోనల్, జిల్లాస్థాయి పోస్టులు ఏమిటనేది తేల్చింది. దీంతోపాటు ఆయా ఉద్యోగులను తమకు ఏ జిల్లా కావాలనేది ఆప్షన్ సైతం అడిగింది. దీంతో తమకు అనుకూలత ఆధారంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు కావాల్సిన జిల్లాను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆయా జిల్లాల నుంచి ఉద్యోగులు కోరుకున్న జిల్లాలకు వారిని కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లాకు కేటాయించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జాయినింగ్ రిపోర్ట్‌ను ఆయా శాఖల ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు. ఈ ప్రక్రియ ఒకటిరెండు రోజుల్లో పూర్తి కావచ్చని అధికారులు పేర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లాకు కేటాయించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు విధుల్లో చేరుతున్నట్లు జాయినింగ్ రిపోర్టులు అందజేస్తున్నారు.
ఉన్నతాధికారులకు జాయినింగ్ రిపోర్ట్లు..
ప్రభుత్వం ఆయా శాఖల వారీగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను వారి ఆప్షన్ మేరకు జిల్లాలకు కేటాయించారు. ఇందులో ఉత్తర్వులు అందుకున్న వారందరూ జిల్లా పరిధిలోని ఆయా శాఖల ఉన్నతాధికారులకు జాయినింగ్ రిపోర్ట్‌లను అందజేశారు. ప్రధానంగా అత్యధికంగా విద్యా శాఖ పరిధిలో ఉపాధ్యాయులు జిల్లాలో విధుల్లో చేరుతున్నారు. జిల్లాకు కేటాయించిన ఉపాధ్యాయులు గురువారం ఒక్కరోజే 1103 మంది వికారాబాద్‌లోని జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో జాయినింగ్ రిపోర్ట్లు అందజేశారు. ఈ మేరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి జాయినింగ్ రిపోర్ట్లు తీసుకుంటున్నారు. ఇకపోతే జిల్లా పరిషత్ పరిధిలో రంగారెడ్డి జిల్లా నుంచి మొత్తం 178 మంది వికారాబాద్ జిల్లాకు కేటాయించారు. వారిలో జూనియర్ అసిస్టెంట్లు 49 మంది, రికార్డ్ అసిస్టెంట్లు 19, టైపిస్ట్‌లు 12, ఆఫీస్ సబార్డినేట్లు 86, నైట్ వాచ్మెన్లు 11, డ్రైవర్ ఒక్కరు ఉండగా ఇప్పటివరకు 173 మంది జిల్లాలో జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మొత్తం 41 మంది జిల్లాకు కేటాయించారు.
వారిలో జూనియర్ అసిస్టెంట్లు 8 మంది, రికార్డ్ అసిస్టెంట్లు ఐదుగురు, టైపిస్ట్‌లు 3, ఆఫీస్ సబార్డినేట్లు 22 మంది, నైట్ వాచ్మెన్లు ముగ్గురు ఉండగా ఇప్పటివరకు 16 మంది జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. రెవెన్యూకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్లు 16 మంది, టైపిస్టులు 14 మంది, అటెండర్లు 10 మంది జిల్లాలో జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గ్రేడ్ 4 గ్రామపంచాయతీ కార్యదర్శులు 20 మంది, జూనియర్ అసిస్టెంట్లు ఇద్దరు, ఆఫీస్ సబార్డినేట్లు ముగ్గురు వికారాబాద్ జిల్లాకు కేటాయింపులు చేపట్టగా వారు జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి 33 మంది జిల్లాకు కేటాయించగా, వారు జాయినింగ్ రిపోర్ట్‌ను అందజేశారు. వివిధ శాఖలకు సంబంధించి జిల్లాకు కేటాయించబడిన ఉద్యోగులు సైతం విధుల్లో చేరుతున్నారు. జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులతోపాటు కేటాయింపుల తర్వాత ఉద్యోగులు జిల్లాలో చేరనున్నారు.
సీనియారిటీ జాబితాకు చర్యలు
బయట జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీ చేపడతారు. వారి సీనియారిటీ జాబితాను శనివారం సాయంత్రం వరకు తయారు చేస్తారు. పాత ఖాళీలు, ఇపుడు అయిన ఖాళీలు మొత్తం చూపిస్తారు. ఈనెల 26, 27వ తేదీల్లో వారి నుంచి ఆప్షన్స్ తీసుకుంటారు. 28, 29వ తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించి 30వ తేదీన పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. తద్వారా ఈనెల 31వ తేదీ లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
రంగారెడ్డిజిల్లాకు 10వేల మంది ఉద్యోగులు
షాబాద్, డిసెంబర్ 24: నూతన జోనల్ విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విభజన ప్రక్రియను చేపట్టింది. కొత్త జిల్లాలు ఏర్పాటు సమయంలో పాత జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ టూ సర్వ్ కింద ఉద్యోగులను రంగారెడ్డిజిల్లాతో పాటు మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు కేటాయించారు. వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రంగారెడ్డిజిల్లాలోని ఆయా మండలాల్లో రిపోర్ట్ చేస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లో కలిపి సుమారు 10వేల మంది వరకు ఉద్యోగులు జాయినింగ్ రిపోర్ట్ అందజేస్తున్నారు.
రంగారెడ్డిజిల్లాలో 1495మంది జాయినింగ్
షాబాద్, డిసెంబర్ 24 : రంగారెడ్డిజిల్లాలో ఉపాధ్యాయుల జాయినింగ్ రెండురోజుల పాటు కొనసాగింది. గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1450మంది ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. అదే విధంగా శుక్రవారం 45మంది ఉపాధ్యాయులు జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. జోనల్, మల్టీజోనల్‌కు సంబంధించి ఈ నెల చివరి వరకు పూర్తి కానున్నట్లు తెలిసింది.