
కరోనా థర్డ్‌వేవ్‌లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. శనివారం సిద్దిపేటలోని 37 వార్డులో ఇంటింటా జ్వర సర్వేలో మంత్రి పాల్గొన్నారు. స్థానికులను ఆప్యాయంగా పలకరించి ఇంటింటా జ్వర సర్వే గురించి వివరించి, వ్యాక్సినేషన్‌పై ఆరాతీశారు. ఈ సందర్భంగా చొరవ తీసుకుని పలువురికి మంత్రి అక్కడికక్కడే టీకా వేయించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జ్వర సర్వే చేపడుతున్నామని,ప్రజలు సహకరించాలని కోరారు. జ్వర సర్వేతో కరోనాను కట్టిడి చేస్తామన్నారు. కరోనా వైద్యానికి ప్రభుత్వ దవాఖానల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి పైసలు ఖర్చుచేసుకోవద్దన్నారు.
సిద్దిపేట, జనవరి 22 : కరోనా థర్డ్‌వేవ్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కరోనా కట్టడికే ప్రభుత్వం ఇంటింటా జ్వర సర్వే చేపడుతున్నదని, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వచ్చి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, లక్షణాలు ఉన్న వారికి హోం ఐసొలేషన్ కిట్లు అందిస్తున్నారని తెలిపారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని 37 వార్డులో ఇంటింటా జ్వర సర్వేలో మంత్రి పాల్గొని సర్వే తీరును పరిశీలించారు. ఈ వార్డులో అందరికీ రెండు డోసుల టీకా వేశారా అని ఆశ వర్కర్లను అడిగారు. వార్డులో తిరుగుతూ ఓ ఇంటి వద్ద ఆగి పోశవ్వ ఎన్ని టీకాలు వేసుకున్నావు అని ఓ వృద్ధురాలిని అడుగగా, ఒకటే వేసుకున్నా అని చెప్పగా, మరి మిగతావి ఎందుకు వేసుకోలేదని అడుగగా, సూది బయపడుతారా అంటూ దగ్గరుండి టీకా వేయించారు. ఏం అమ్మ మీ ఇంట్లో అందరూ టీకా వేసుకున్నారా అని మంత్రి అడిగారు. గ్యాదగోని రేణుక ఇంట్లో 60 ఏండ్లు నిండిన అవ్వను నువ్వు ఎన్ని డోస్‌లు వేసుకున్నావ్ తల్లి అని ఆరా తీయగా, రెండు అని చెప్పగానే రెండు కాదు, మూడు టీకాలు పడాలి అని ఆర్ఎంవో కాశీనాథ్‌ను ఆన్లైన్లో చెక్ చేసి బూస్టర్ డోస్ దగ్గరుండి ఇప్పించారు. అదే క్రమంలో అంజమ్మను పలకరిస్తూ, నీకు మాస్క్ లేదు మాస్క్పెట్టుకో అని తన వద్దనున్న మరో మాస్క్‌ను మంత్రి ఇచ్చారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు దేవవ్వతో ముచ్చటిస్తూ.. టీకాలు వేసుకున్నావా…ఆరోగ్యం బాగుందా అని అడిగి మంత్రి తెలుసుకున్నారు. సర్వే సమయంలో జ్వరం, ఇతర లక్షణాలు ఉన్న వారికి అక్కడిక్కడే మెడిసిన్ కిట్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 12.68 లక్షల మంది ఇండ్లకు వెళ్లి ఆరోగ్య బృందాలు సర్వేచేశాయన్నారు. దాదాపు 48 వేల మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి హోం ఐసొలేషన్ కిట్లు అందించినట్లు తెలిపారు. ఈ కిట్లను వాడడం ద్వారా కరోనా 99శాతం తగ్గుతుందన్నారు. హోం ఐసొలేషన్ కిట్లు ఇచ్చిన వారి ఇంటి వద్దకు ప్రతిరోజు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి అధికారులు సమీక్షిస్తారని తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే దగ్గరిలోని దవాఖానలో చికిత్స అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
సీఎం ఆదేశాల మేరకు జర్వ సర్వే..
సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జ్వర సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. 5 నుంచి 6 రోజుల్లో సర్వే పూర్తవుతుందన్నారు. ఎంతమంది వస్తే అంతమందికి టెస్టు చేసి కిట్లను అందించాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. కొన్నిచోట్ల టెస్టులకు క్యూలు ఎక్కువగా ఉన్నాయని తెలియగానే టెస్టింగ్ సెంటర్లను పెంచాలని అధికారులను ఆదేశించిటన్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దవాఖానల వద్ద బారులు తీరితే కేసులు పెరిగే అవకాశం ఉందని, అందుకే పరీక్ష కేంద్రాలను పెంచామన్నారు. ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం టెస్టులు అవసరం లేదని, లక్షణాలు ఉన్న వారికి హోం ఐసొలేషన్ కిట్లతో వ్యాధి తగ్గిపోతుందన్నారు. సెకండ్ వేవ్‌లో దాదాపు 20 లక్షల కిట్లు ఇచ్చామని, అప్పుడు అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. మూడో వేవ్‌లో రెండు మూడు రోజులుగా కేసులు ఎక్కువగా పెరుగుతుండడంతో ఇంటింటా జ్వర సర్వేను రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నట్లు ఎన్ని కుటుంబాలు సర్వేచేశారు, ఎన్ని కిట్లు ఇచ్చారో ప్రతీరోజు సాయంత్రం తెలుసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని జిల్లా, ఏరియా దవాఖానల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేశామన్నారు. పిల్లల కోసం వెంటిలేటర్లు, మానిటర్లను సిద్ధం చేశామన్నారు. అన్నిరకాల మందులను ప్రభుత్వం సమకూర్చిందని మంత్రి తెలిపారు. 2కోట్ల టెస్టింగ్ కిట్ల అన్ని దవాఖానల్లో అందుబాటులో పెట్టిందని, కోటి హోం ఐసొలేషన్ కిట్లను పంపామన్నారు.
ప్రైవేట్ వద్దు..
ప్రజలు ఆందోళన పడి ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి పైసలు ఖర్చుచేసుకోవద్దని, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. కంటికి రెప్పలా కపాడుతుందన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే స్థానిక దవాఖానలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలన్నారు. అన్ని పీహెచ్‌సీల్లో వైద్యులు అందుబాటులో పెట్టామన్నారు. కరోనా తగ్గేవరకు పని దినాలు, ఆదివారాల్లో తీవ్రతను బట్టి పనిచేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు ఆదేశించామన్నారు. ప్రజలు కరోనా లక్షణాలు ఉంటే వెంటనే స్థానిక దవాఖానకు వెళ్లాలని మంత్రి సూచించారు. ఆరోగ్యశాఖ కార్యకర్తలకు ఫోన్ చేస్తే వారు వచ్చి మందులు ఇచ్చి, జాగ్రత్తలు చెప్పి వైద్యం అందిస్తారని, సొంత వైద్యం చేసుకోవద్దని సూచించారు. వ్యాక్సిన్ వేసుకోవాలని, టీకా మనకు రక్షణ కవచంగా పనిచేస్తున్నదన్నారు. 60 ఏండ్లు దాటిన వారికి బూస్టర్‌డోస్, 15నుంచి 18ఏండ్ల లోపు ఉన్న వారికి టీకా వేస్తున్నామన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు, కౌన్సిలర్ సాకి బాల్‌లక్ష్మి అనంద్, డీఎంహెచ్‌వో మనోహర్, మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి, ఆర్ఎంవో డాక్టర్ కాశీనాథ్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఉన్నారు.