పుర్నియా: కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి చేపడుతున్న ఓట్ అధికార్ యాత్రపై ప్రధాని మోదీ(PM Modi) విమర్శలు చేశారు. చొరబాటుదారుల్ని కాపాడేందుకు సిగ్గులేకుండా ఆ రెండు పార్టీలు కలిసి యాత్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీహార్లోని పుర్నియాలో ఆయన ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారుల్ని విపక్ష పార్టీలు రక్షిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. పుర్నియా కార్యక్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. సుమారు 36 వేల కోట్ల ఖర్చుతో ఆ ప్రాజెక్టులు చేపడుతున్నారు. దీంట్లో జాతీయ మకానా బోర్డు కూడా ఉన్నది.
బీహార్ ప్రతిష్టకు కాంగ్రెస్, ఆర్జేడీలు భంగం కలిగించాయని, బీహార్ గుర్తింపును కూడా ఆ పార్టీలు నాశనం చేసినట్లు ఆయన ఆరోపించారు. సీమాచల్, తూర్పు భారతంలో చొరబాటుదారుల వల్ల భౌగోళిక సంక్షోభం ఏర్పడిందన్నారు. బీహార్, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోని ప్రజలు .. తమ కూతుళ్లు, అక్కాచెల్లెల్ల గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. దాని కోసం ఎర్రకోట ప్రసంగంలో డెమోగ్రఫీ మిషన్ను ప్రకటించినట్లు ఆయన చెప్పారు.
బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన సిర్ ప్రక్రియను విపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం .. కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు.. చొరబాటుదారుల్ని రెచ్చగొడుతున్నాయని, విదేశాల నుంచి వచ్చిన వారి కోసం యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. చొరబాటుదారుడు ఎవరైనా వెళ్లిపోవాల్సిందే అని, చొరబాట్లను అడ్డుకునే బాధ్యత ఎన్డీఏకు ఉందన్నారు.