నీలగిరి, ఏప్రిల్ 3 : పోలీస్ ఉద్యోగార్థుల కోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణకు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ విజయవంతంగా ముగిసింది. మార్చి 28, 29న రెండ్రోజుల పాటు నిర్వహించిన శారీరక దారుఢ్య పరీక్షల్లో 1,557 మంది ఎంపికకాగా, ఆదివారం జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాలలో నిర్వహించిన పరీక్షకు 1,385 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా మంది రాత పరీక్షలో ప్రతిభ చూపించి శారీరక పరీక్షల్లో వెనుకబడుతారని, అందుకే ముందుగానే శారీరక పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు వసతి కల్పించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ ఆదిరెడ్డి, ఏఆర్ యంత్రాంగం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.