సిద్దిపేట, జనవరి 16 : బీజేపీ ఝూటా పార్టీ అని, ఆ పార్టీ నిజస్వరూపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నాయకుడు పటెండ్ల రాజారాం, మండల నాయకుడు బోయిని ఎల్లం తమ అనుచరులతో కలిసి శనివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి హరీశ్‌రావు కండువాలు కప్పారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. మొన్న రైతు చట్టాలు తెచ్చి, రైతులను రాబందుల్లా చూశారన్నారు. నిన్నటికి నిన్న ఎరువుల ధరలు పెంచి రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఒక వైపు సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి 24 గంటల కరెంట్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, విత్తనాలు ఇస్తుంటే, కేంద్రంలోని బీజేపీ రైతులను సంక్షోభంలో పడేస్తున్నదన్నారు. బీజేపీని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని దుయ్యబట్టారు. సోషల్ మీడియా అబద్ధాల ప్రచారం ఎక్కువ కాలం సాగదని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఊడగొట్టుడు, నిరుద్యోగుల పొట్టగొట్టుడే బీజేపీ నినాదమని చెప్పారు. కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ ఎన్నో ఉద్యోగాలు తీసేసిందన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలన్నా.. ఉపాధి కల్పించాలన్నా.. సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. మన మేలు కోరే పార్టీ టీఆర్ఎస్ అని, టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ఇంటి పార్టీ అని చెప్పారు. పార్టీలో చేరిన వారు పిట్ల నరేశ్, సూరగోని మహేశ్, రాజు, సురేశ్, అనిల్, కనకయ్య, మహేశ్ ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచు ఆంజనేయులు, ఎంపీటీసీ హరీశ్, మాజీ సర్పంచు కనకయ్య, సత్తయ్య, మాజీ ఎంపీటీసీ మల్లేశం, ముత్యం, గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల బాబు పాల్గొన్నారు.