ప్రగతి భవన్లో మంత్రుల సమక్షంలో సన్మానం
భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం
పేద కుటుంబం తలరాత మార్చిన సీఎం
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 1: ఆదివాసీ బిడ్డ, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిన రామచంద్రయ్యకు సీఎం కేసీఆర్ రూ.కోటి నజరానా ప్రకటించారు. అంతరించిపోతున్న ఆదివాసీ చరిత్రకు జీవం పోసిన రామచంద్రయ్యకు ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రామచంద్రయ్యను హైదరాబాద్ ప్రగతిభవన్లో సత్కరించారు. రూ.కోటి నజరానా ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు సూచించారు. గిరిజన కుటుంబం తలరాత మారింది: ప్రభుత్వ విప్ రేగా‘నిరుపేద గిరిజన కుటుంబం తలరాతను సీఎం కేసీఆర్ మార్చారు. కళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. గిరిజన బిడ్డకు రూ.కోటి పారితోషికం ప్రకటించడంతోపాటు జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం ఇస్తామనడం చాలా సంతోషం. యావత్ గిరిజన సమాజం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటుంది.’