
విత్తనం నాటినప్పటి నుంచి పంట ఉత్పత్తులను అమ్ముకునే వరకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటున్నది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో సేకరిస్తున్నది. దీంతో మార్కెట్లో ఈ ఏడాది అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. పత్తి, మిర్చితో పాటు ఇతర పంటలకు మద్దతు ధరకంటే ఎక్కువ రేటు పలుకుతున్నది. ముఖ్యంగా పత్తికి మునుపెన్నడూ లేనంత రేటును రైతులు పొందుతున్నారు. మార్కెట్ చరిత్రలో తొలిసారి క్వింటాల్‌కు రూ.పది వేలకు చేరడంతో సంబురపడుతున్నారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కూడా లక్ష్యానికి మించి ఆదాయం సమకూరిందని మార్కెటింగ్‌శాఖ జిల్లా అధికారి పాలకుర్తి ప్రసాదరావు చెప్పారు. కమిటీలకు లక్ష్యానికి మించి ఆదాయం వస్తున్న నేపథ్యంలో గురువారం
‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లో…
వరంగల్, జనవరి 13(నమస్తేతెలంగాణ) : ఈ ఏడాది మార్కెట్లో అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ రేటు పలుకుతున్నది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ పొడవు రకం పత్తికి రూ.6,025. మధ్య రకం పింజ పత్తికి రూ.5,725 ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి మా ర్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.6,500 నుంచి రూ.7 వేలపైన పలికింది. ఇటీవల క్వింటాల్ రూ.10 వేలకు చేరువైంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మా ర్కెట్లో ఈ నెల 6న పత్తి గరిష్ఠ ధర రూ.9,750 పలికింది. ఇది మార్కెట్ చరిత్రలో ఆల్‌టైం రికార్డు. మార్కెట్లో క్వింటాల్ పత్తి కనీస ధర ప్రస్తుతం రూ.7,400 ఉంది. సీసీఐ ద్వారా రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు ఈ ఏడాది జిల్లాలో ప్రభుత్వ సెంటర్ల నిర్వహణకు సన్నాహాలు చేశాం. మార్కెట్లో పత్తికి ప్రభు త్వ మద్దతు ధర కంటే ఎక్కువ రేటు పలుకుతుండడంతో కొనుగోలు కేంద్రాలను తెరువలేదు. వేరుశనగకు క్వింటాల్ ప్రభుత్వ మద్దతు ధర రూ.5,550 ఉం టే మార్కెట్లో గరిష్ఠ ధర రూ.7,650 పలికింది. క్విం టాల్ మినుములకు రూ.6,300 ఉంటే మార్కెట్లో గరిష్ఠంగా రూ.6,352 లభించింది.
ఎర్రబంగారానికీ మంచి రేటు..
పత్తికే కాదు మిర్చి, ఇతర పంట ఉత్పత్తులకూ మునుపెన్నడూ లేని ధరలు పలుకుతున్నాయి. ఎనుమాముల మార్కెట్లో ఈ ఏడాది క్వింటాల్‌కు గరిష్ఠంగారూ. 19 వేలు లభించింది. దీంతో గత ఏడాది మంచి ధర లేకపోవటంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చిని ప్రస్తుతం అమ్ముతున్నారు. తేజ, వండల్హాట్, యూఎస్ 341, దీపిక, దేశి, సింగిల్పట్టి, డీడీ, 1048, సన్నాలు, 273, తాలు వంటి రకాల మిర్చిని రైతులు మార్కెట్‌కు తెస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే సుమారు 60 వేల క్వింటాళ్ల మిర్చి మార్కెట్‌కు వచ్చింది. కొత్త మిర్చి కూడా రావడం మొదలైంది. ఈ నెలాఖరువరకు ఇంకా పెరుగనుంది.
లక్ష్యం దాటిన ఆదాయం..
పంట ఉత్పత్తుల క్రయ విక్రయాల జోరుతో మార్కెటింగ్ శాఖకు టార్గెట్‌కు మించి ఆదాయం సమకూరుతున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 104 శాతం ఆదాయం వచ్చింది. జిల్లాలో ఎనుమాముల, నర్సంపేట, నెక్కొండ, వర్ధన్నపేట(ఇల్లంద) మార్కెట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఈ సంవత్సరం ఆదాయ లక్ష్యం రూ.34.25 కోట్లు. కాగా, ఇప్పటికే రూ.35.94 కోట్ల ఆదాయం సమకూరింది. వర్ధన్నపేట మార్కెట్ 137 శాతంతో ఆదాయంలో ఇతర మార్కెట్లకంటే ముందంజలో ఉంది.
కందుల కొనుగోలు కేంద్రాలు..
ప్రభుత్వ మద్దతు ధరతో మార్క్‌ఫెడ్ ద్వారా కందులను కొనుగోలు చేసేందుకు జిల్లాలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీటిలో ఒకటి వరంగల్ ఎనుమాముల మార్కెట్లో, రెండోది వర్ధన్నపేట మార్కెట్ పరిధిలోని ఇల్లందలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్ ఇప్పటికే సమీక్ష చేశారు. ఈ నెల చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎనుమాముల, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా పర్వతగిరి, నర్సంపేటలో వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించాం. పర్వతగిరి సెంటర్లో 308 మంది రైతుల నుంచి 12,169, నర్సంపేట సెంటర్లో 170 మంది రైతుల నుంచి 6,647 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాం. ప్రభుత్వం జిల్లాలో ఇప్పటివరకు 19.45 లక్షల క్వింటాళ్ల వానకాలం ధాన్యం కొనుగోలు చేసింది.