
ఖమ్మం, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో జనవరి మొదటి వారం నుంచి కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో వైరస్ నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, కొవిడ్ బారిన పడినవారికి తగిన వైద్యసహాయం అందించేందుకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రితోపాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. సంక్రాంతి సందర్భంగా షాపుల్లో గుంపులు గుంపులుగా తిరగడం, మాస్క్‌లు లేకుండా వెళ్లడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటివి చేయవద్దని సూచించారు. మొదటి దశ కొవిడ్ వ్యాక్సినేషన్లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉందని, ఇప్పటికే 10.78 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని, 8.88 లక్షల మందికి రెండో డోస్ వేశామని తెలిపారు. అలాగే 41 వేల మంది పిల్లలకు గాను 20 వేల మంది పిల్లలకు వ్యాక్సిన్ వేశామన్నారు. మిగిలిన 21 వేల మంది పిల్లలకు వ్యాక్సిన్ చేయాల్సి ఉండగా సంక్రాంతి సెలవుల కారణంగా విరామం వచ్చిందని అన్నారు. అర్హులందరికీ బూస్టర్ డోస్ ఇస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రితోపాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులకు పూర్తి వైద్యసహాయం అందేలా వైద్యాధికారులు పర్యవేక్షిస్తారన్నారు. కొవిడ్ వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రులు ఎంతమేరకు ఫీజులు వసూలు చేయాలో ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అంతకుమించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ప్రతి రోజూ 4 వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నామని, జనవరి 1 నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. కొవిడ్ వైద్యసహాయం, సందేహాల నివృత్తి కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్ 1077కు కాల్ చేసి అవసరమైన సాయం పొందవచ్చని, వాట్సాప్ నెంబర్ 9063211298 ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. అడిషనల్ సీపీ గౌస్ ఆలామ్ మాట్లాడుతూ ముందుజాగ్రత్త చర్యలతో కొవిడ్ బారిన పడకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తం కావాలని సూచించారు. మాస్క్ లేకుండా తిరిగితే రూ.1,000 జరిమానా విధిస్తున్నామని, ఈ నియమాన్ని మరింత కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వైద్యశాలల్లోనూ సౌకర్యాలు ఉన్నాయని, ఖమ్మంలో 320 బెడ్లను సిద్ధంగా ఉంచామని అన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసేందుకు ఖమ్మంలో ల్యాబ్ అందుబాటులో ఉందని, రోజుకు 500 నుంచి 600 టెస్టులు చేస్తున్నామని అన్నారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ మాస్క్‌లు లేని వినియోగదారులను లోపలికి అనుమతిస్తే దుకాణ దారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ రాజేశ్, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ కో ఆర్డినేటర్ డాక్టర్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఉత్తర ద్వార దర్శనం
భద్రాచలం, జనవరి 12 : శ్రీసీతారామచంద్ర స్వామిదేవస్థానం నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గురువారం ఉదయం 3 నుంచి 4.30 గంటల వరకు స్వామివారికి మేలుకొలుపు, ఆరాధన దేవస్థానం హరిదాసులచే కీర్తనలు ఆలపించి, ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం నిమిత్తం ఉత్తర ద్వారం వద్దకు తీసుకువస్తారు. ఉదయం 4.30 నుంచి 5 గంటల వరకు ఆస్థానాచార్యులు కేఈ స్థలశాయి వైకుంఠ ఏకాదశి వైభవం గురించి ప్రవచనం చేస్తారు. 5 గంటలకు సమస్త మంగళవాయిద్యాలు, గంటలు, వేద ఘోషల నడుమ సాంబ్రాణి ధూపాలతో వైకుంఠ ద్వారం తెరుస్తారు. ఉదయం 5 నుంచి 5.11గంటల వరకు వినత సుత వాహన కీర్తనలతో నాదస్వరం నిర్వహిస్తారు. 5.21 వరకు ఆరాధన, శ్రీరామ షడాక్షరీ, మస్త్ర సంపుటి, అష్టోత్తర శతనామార్చాన, 5.20 నుంచి 5.30వరకు చతుర్వేద విన్నపాలు, 5.30 నుంచి 5.40వరకు ఉత్తర ద్వార దర్శన ప్రాశస్త్యం వివరిస్తారు. 5.40 నుంచి 6గంటల వరకు శరణాగతి గద్య విన్నపం, తిరుప్పల్లాండు మంగళాశాసనం, 108వత్తులతో హారతి ఇస్తారు. అనంతరం 6గంటలకు అడుగో కోదండపాటి కీర్తనతో వైకుంఠ ద్వారం నుంచి స్వామివారు తిరువీధి సేవకు బయలుదేరుతారు.