అమీర్‌పేట్ : సంస్కృతంలోని భగవద్గీతను సామాన్యులు కూడా సునాయాసంగా అర్ధం చేసుకునే విధంగా సహజమైన పదాలతో చక్కటి పద్యకావ్యాన్ని రూపొందించిన రిటైర్డ్ పోలీసు, ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్‌కు చెందిన డ్యాగ బాల్‌రాజ్ యాదవ్ ‘సహజ కవి’ బిరుదును అందుకున్నారు.
ఆదివారం ఉదయం ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సహజకవిగా డ్యాగ బాలరాజు యాదవ్, ‘ఆస్థాన పండిత’ బిరుదును బిచ్చప్ప మంత్రి తలసాని చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపేందుకు దోహదం చేసే అనేక చక్కటి పుస్తకాలతో పాటు జీవన గమనంలో మనిషికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను సహజమైన పదాలతో పద్యకావ్యంగా తీర్చిదిద్దిన డ్యాగ బాలరాజుయాదవ్ భవిష్యత్‌లో మరిన్ని మంచి పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.
తెలుగు పండిట్‌గా ఉన్న విశేష అనుభవంతో కౌన్సిల్ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో చక్కటి విశ్లేషణలు చేస్తూ కార్యక్రమాలను రక్తి కట్టిస్తున్న బిచ్చప్పకు ఆస్థాన పండితులుగా గుర్తింపునివ్వడం ఎంతో సముచితమన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, కౌన్సిల్ అధ్యక్షులు కాసాని సహదేవ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.