వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరహాలో నిరసనలు, రాస్తారోకోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 4 నుంచి 11 వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేసి ఢిల్లీకి సెగ తగిలేలా చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునివ్వగా ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో పార్టీ శ్రేణులు, రైతులు సిద్ధమవుతున్నారు. రైతుల పక్షాన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని
జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
సూర్యాపేట, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక, విద్యుత్ రాక, సకాలంలో ఎరువులు, విత్తనాలు లభించక ఉన్న వ్యవసాయ భూమిలో 20 శాతం కూడా సాగులో రాకపోయేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నీళ్లు, కరెంట్, ఎరువులు, విత్తనాలే కాదు పెట్టుబడి సాయం కూడా అందుతుండడంతో వందశాతం భూమి సాగులోకి వచ్చింది. దాంతో పంటలు పుష్కలంగా పండి రాష్ట్రం పచ్చగా మారడం, దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా మారుతుండడం, తెలంగాణ రైతుల సంతోషంగా ఉండడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక పోతున్నది. కేవలం రాజకీయం కోసమే రాష్ట్రంపై, ఇక్కడి రైతుల పై కుట్రలు పన్నుతోంది. రైతుల మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రం షరతులు విధిస్తున్నా.. సీఎం కేసీఆర్ ససేమిరా అంటున్న విషయం విదితమే. దాంతో పాటు దేశంలోని ఇతర రాష్ర్టాల రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తూ.. తెలంగాణ ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయడం లేదు.
నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఉద్యమం చేయగా.. నేడు రైతుల పక్షాన కేంద్రంలోని బీజేపీపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు టీఆర్ఎస్ రూపకల్పన చేస్తున్నది. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు బీజేపీకి సెగ తగిలేలా వివిధ స్థాయిల్లో పలు రూపాల్లో ఉద్యమాలు చేసేందుకు టీఆర్ఎస్ సమాయత్తం అవుతున్నది.
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4 నుంచి రైతుల పక్షాన ఆందోళనలు, నిరసనలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 4న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, 6న జాతీయ రహదారిపై రాస్తారోకో, 7న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 8న గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, నిరసన ప్రదర్శన, ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయడం, మున్సిపాలిటీల్లో బైక్ ర్యాలీలు, నల్లజెండాలు ఎగురవేయడం, 11న ఢిల్లీలో ప్రజాప్రతినిధుల నిరసన దీక్షలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు విజయవంతం చేయాలని, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి పాల్గొనాలని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
దేవరకొండ /కట్టంగూర్ : తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 4 నుంచి పెద్ద ఎత్తున ఆందోళ చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆందోళన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఆందోళనల్లో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు భాగస్వాములు కావాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం ఒక ప్రకటనలో కోరారు.