కోటపల్లి, ఏప్రిల్ 15 : పుష్కరస్నానం సకల శుభదాయకం, సమస్త పాపహరణం.. నిరంతరారోగ్యకరం, లోక కల్యాణదాయకం అని శాస్ర్తాలు చెబుతున్నాయి. నర్మదా నదీ తీరంలో తపస్సు చేస్తే ముక్తి లభిస్తుంది. గంగాతీరాన మరణిస్తే సకల పాపాలు నశిస్తాయి. కురుక్షేత్రంలో దానం చేసేంత సంపదలు కలుగుతాయి, మోక్షలక్ష్మి వరిస్తుంది. ప్రాణహితలో పుష్కర స్నానం చేస్తే ఈ మూడు సత్ఫలితాలు పొందుతారు. కాగా.. నదుల్లోకి వచ్చే నీరు కొండలపై నుంచి జాలువారుతుంది. కొండల్లో ఉండే ఔషధ మూలికలు, వనాలు, సుగంధ ద్రవ్యాలు ఉండే చెట్లపైన కురిసిన వర్షాలు వాటిలోని ఔషధగుణాలను వెంటబెట్టుకని ప్రవహిస్తాయి. అందుకే పవిత్ర స్నానం ఆరోగ్యదాయకం.
ఇంటి వద్ద జపం చేసే అలవాటు ఉన్న వారు అక్కడే స్నానం చేసి వచ్చి పుష్కర స్నానం చేయాలి.
ఇంటి వద్ద స్నానం చేయడానికి వీలుపడని వారు ప్రాణహితలో బట్టలు తడుపుకొని వచ్చి, మళ్లీ వెళ్లి నదిలో సంకల్ప స్నానం ఆచరించాలి.పుష్కర స్నానం ఆచరించే ముందు తీరంలోని మట్టిని తీసుకెళ్లి, స్నానం తర్వాత మళ్లీ ఒడ్డున వేయాలి. దీని వల్ల ‘కృత్య’ అనే రాక్షసుడు మట్టి రూపంలో ఉన్న పాపాన్ని తీసుకెళ్లి, పుణ్యాన్ని మనకు వదిలేస్తాడు.పుష్కరస్నానం తర్వాత పుణ్యక్షేత్రాలను దర్శిస్తే పుణ్యఫలం లభిస్తుంది.నదీ స్నానాన్ని బ్రహ్మ ముహూర్తం నుంచి సాయంత్రం వరకు ఆచరిస్తే మంచిది.
నదీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి.ఇంటి వద్ద స్నానం చేసి, శుచియై నదిలో పుణ్యస్నానం చేయడం మంచిది.ఇంటి వద్ద స్నానం చేయకుండా, నేరుగా నదీ స్నానానికి వస్తే ముందు తూర్పు దిశగా తిరిగి ఒకసారి మునగాలి. ఆ తర్వాత ప్రవాహానికి అభిముఖంగా స్నానమాచరించాలి.స్నానానికి శుభ్రమైన తెల్లని వస్త్రం ధరించాలి. ఎర్ర రంగు వస్త్రం ఉపయోగించరాదు. ఇతరులు ధరించినవి, మాసినవి, చిరిగినవి ధరించరాదు.పుష్కర స్నానానికి ముందు గట్టుమీద మట్టిని నదిలో వేయాలి.
పవిత్ర స్నానం చేసేటప్పుడు మూడు మునకలు వేయాలన్నది వేద పండితుల వాక్కు. మొదటి మునకతో బాహ్యశరీరం శుద్ధి అవుతుంది. తెలిసి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం. రెండో మునకతో అంతఃశరీర శుద్ధి జరుగుతుంది. తెలియకుండా చేసిన తప్పులకు పాపవిముక్తి. మూడో మునకతో అత్మశుద్ధి జరుగుతుంది. భగవంతుడి అనుగ్రహం సిద్ధిస్తుంది.
వేమనపల్లి, ఏప్రిల్ 15 : వేమనపల్లి ప్రాణహిత పుష్కర ఘాట్‌కు మూడో రోజు శుక్రవారం భక్తులు పుణ్య స్నానాలకు పోటెత్తారు. సుమారు 10 వేల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్ర్టాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. ఉదయం 5 గంటల నుంచే పుష్కర స్నానాలు చేసి నదిలో దీపాలు వదిలారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సహకారంతో మండల పార్టీ అధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌రావు ఆధ్వర్యంలో నిత్యాన్నదానం నిర్వహించారు. జడ్పీ సీఈవో నరేందర్ దంపతులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. డీఎల్పీవో ఫణిందర్ పుష్కర ఘాట్‌ను పరిశీలించారు. ఘాట్ వద్ద 108 అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు.
వేమనపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పలువురు శ్రార్ధ పిండ ప్రదానాలు నిర్వహించారు. ఇసుకలో సైకత లింగాలను తయారు చేసి దీపాలు వెలిగించి పూజలు చేశారు. నదిలో చీర, సారె, దీపాలు వదిలారు. నీల్వాయికి చెందిన పద్మారెడ్డి భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. జడ్పీటీసీ స్వర్ణలతా సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. నీల్వాయి ఎస్ఐ నరేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎంపీపీ ఆత్రం గణపతి, సర్పంచ్ కుబిడె మధుకర్, నాయకులు తలండి భీమయ్య, లక్ష్మీనారాయణ, కుమ్మరి బాపు, ఎంపీటీసీ దాగామ బాపు, నాయకులు మోర్ల మొండి పురాణం లక్ష్మీకాంత్, మోతె రవి, రజాక్, సంతోష్, నాయకులు పాల్గొన్నారు.
కోటపల్లి, ఏప్రిల్ 15 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద గల ప్రాణహిత నదిలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఎన్ఏడీ కాలనీకి చెందిన గుడ్ల సోమేశ్వర్రావ్ పుష్కరస్నానం ఆచరించేందుకు వచ్చాడు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు స్నానం చేస్తుండగా మూర్చవ్యాధితోపాటు గుండెపోటు రావడంతో నదిలో పడిపోయాడు. అప్పటికే అతడి కుటుంబ సభ్యులు స్నానం ముగించుకొని ఒడ్డుకు రాగా.. అతడిని ఎవరూ గమనించలేదు. సోమేశ్వర్రావ్ ఒడ్డుకు రాకపోవడంతో అనుమానం వచ్చి నదిలో గాలింపు చేపట్టగా మృతదేహం కనిపించగా బయటకు తీశారు. మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సోమేశ్వర్రావ్ భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.