వర్షపు నీటిని ఒడిసిపట్టి, వృథా నీటికి చెక్ పెట్టేందుకు నిర్మల్ జిల్లాలో సర్కారు చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నది. మొదటి విడుతగా 21 నిర్మాణానికి రూ.58.25 కోట్లు వెచ్చించింది. ఇందులో ఎనిమిది పూర్తికాగా.. మిగతావి చివరిదశకు చేరుకున్నాయి. తాజాగా రూ.201.65 కోట్లతో 42 చెక్‌డ్యాంల నిర్మాణం కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ 63 పూర్తయితే జిల్లా సాగులో స్వర్ణయుగం కానున్నది. భూగర్భ జలాలు పెరగడంతో పాటు బీడు భూముల్లో బంగారు పంటలు పండనున్నాయి. ఒక్క పంట పండిస్తున్న రైతు రెండు పంటలు వేసే అవకాశం ఉంది. ఫలితంగా అన్నదాతలు ఆర్థిక ప్రయోజనం పొందుతారు.
నిర్మల్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : నిర్మ ల్ జిల్లాలో గోదావరి, దాని ఉపనదులు ప్రవహిస్తాయి. వీటి పరిధిలోని వాగుల ద్వారా వృ థాగా ప్రవహిస్తున్న నీటిని ఒడిసి పట్టేందుకు నీటి పారుదలశాఖ అధికారులు చెక్ డ్యాంలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు అనుకూలమైన ప్రదేశాలు, నిల్వ ఉండే నీటితో చేకూరే ప్రయోజనాలను శాటిలైట్ సాంకేతికతతో గుర్తించారు. మొదటి దశ కింద 6,238 ఎకరాల ఆయకట్టుకు పరోక్షంగా సాగునీటిని అందించాలనే లక్ష్యంతో 21 చెక్ డ్యాంల నిర్మాణాలను చేపట్టారు. దీని కోసం రూ.58. 25 కోట్లు వెచ్చించారు.
ఇప్పటికే ఎనిమిదింటి పనులు పూర్తికాగా.. మరో పదమూడింటి ప నులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. వీటి కి తోడు కొత్తగా మరో 42 ని ర్మించాలని భావిస్తున్నారు. ఇందుకోసం రూ. 201.65 కోట్లతో అంచనాలు రూపొందించారు. త్వరలోనే సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. చెక్ డ్యాంలు పూర్తికావడం వల్ల భూగర్భ జలాలు మూడు నుంచి నాలుగు మీటర్లు పెరిగినట్లు గ ణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్వర్ణ వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంల వల్ల 2020 సెప్టెంబర్‌లో 3.05 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 20 21 సెప్టెంబర్ నాటికి 1.75 మీ టర్ల పైకి వచ్చాయి. అలాగే మాటే గాం వద్ద 5.96 మీటర్ల నుంచి 1.96 మీటర్లకు.. వంజర్లో 4.03 నుంచి 2.02కు.. బీరవెల్లిలో 5. 24 నుంచి 1.81 మీటర్ల పరధిలోనే నీరు అందుబాటులోకి వచ్చింది. ఇలా చెక్‌డ్యాంలు నిర్మించిన అన్ని చోట్ల భూగర్భ జలాలు పెరిగినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
వాగులు, వంకలపై ఏడాది క్రితం మొదటి విడుత కింద 21 చోట్ల చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు కడెం వాగుపై రెండు చోట్ల, సుద్దవాగుపై సాంగ్వి, కల్లూరు గ్రామాల వద్ద మరో రెండు చోట్ల చెక్ డ్యాం పనులు పూర్తయ్యాయి. మాలేగాం వాగుపై బిజ్జూరు, మాటేగాం గ్రామాల శివారులో రెండు చోట్ల పనులు పూర్తి కాగా, స్వర్ణ వాగుపై చిట్యాల, తాంశ గ్రామాల పరిధిలో మరో రెండు చోట్ల మొత్తం ఎనిమిది చెక్ డ్యాంల పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు మలక్ చించోలి, యాకర్పెల్లి, బీరవెల్లి, గొడిసెర, కంకెట, తాండ్ర(జీ), వంజ ర్, వైకుంఠాపూర్ గ్రామాల పరిధిలోని వాగులతోపాటు కనకాపూర్ వాగుపై నాలుగు చోట్ల నిర్మిస్తున్న పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ వేసవిలో నీరు తగ్గితే నెలాఖరు వరకు పనులు పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే గుర్తించిన మరో 42 కొత్త చెక్‌డ్యాంల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా భూగర్భ జలశాఖ అధికారులు గత మార్చి 24న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కొత్తగా నిర్మించబోయే వా టిలో నిర్మల్ నియోజకవర్గ పరిధిలో వెంగ్వాపేట్, జాఫ్రాపూర్, సోన్, కనకాపూర్, లక్ష్మణచాంద, రాచాపూర్, తిరుపెల్లి, మునిపెల్లి, పరిమండల్, రామ్‌సింగ్ తండా, పొట్యా, సిరిపెల్లి తండా, తాండ్ర(జీ), బోరిగాం, కౌట్ల(బీ) తదితర గ్రామాలున్నాయి. ముథోల్ నియోజకవర్గ పరిధిలో కామోల్, దోనిగాం, పొట్పెల్లి, సాత్ గాం, పుస్పూర్, చొండి, రాజురా, కుప్టి, అం దకూర్, దౌనెల్లి, ముథోల్, బిద్రెల్లి, ఝరి (బీ) మొదలగు గ్రామాల పరిధిలోని వాగులపై చెక్‌డ్యాంలను నిర్మించనున్నారు. వీటితోపాటు ఖానాపూర్ నియోజకవర్గంలో తర్లపాడ్, ఖా నాపూర్, దిలావర్పూర్, చందూనాయక్ తం డా, షెట్పెల్లి, నాయకపుగూడ, కొసగుట్ట, తా టిగూడ, మందపెల్లి, ఇదే గ్రామ పరిధిలో చిలకలయ్య ఆలయం సమీపంలో, మందపెల్లి రోడ్ బ్రిడ్జి వద్ద, పెంబికి వెళ్లే పాత రోడ్డు వద్ద, మందపెల్లి వాగులోని సీతా పరుపుల వద్ద మొత్తం 42 చోట్ల ఈ చెక్ డ్యాంలను నిర్మించనున్నారు.
నిర్మల్ జిల్లాలో మొదటి దశ కింద 21 చెక్‌డ్యాంల నిర్మాణాన్ని చేప ట్టాం. వీటిలో కొన్ని పనులు పూర్తయ్యాయి. మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. ఈనెలాఖరు వరకు 100 శాతం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్తగా మరో 42 చెక్‌డ్యాంల నిర్మాణానికి అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వ అనుమతి రాగానే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. చెక్‌డ్యాంల నిర్మాణానికి ఎండాకాలమే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వారం పది రోజుల్లోనే అనుమతులు వస్తాయని ఆశిస్తున్నాం.
– రామారావు, జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ, నిర్మల్
నాకు చిట్యాల వాగు ఒడ్డున నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. పంటలు సాగు చేసేందుకు బోరుబావే ఆధారం. ఉన్న కొద్దిపాటి భూమిలో వరి, మక్క, పసుపు పంటలు పండిస్తా. వానకాలం పంట మాత్రమే చేతికొచ్చేది. యాసంగిలో పంటలు వేస్తే బోరుబావి నుంచి సరిపడా నీళ్లు రాక చివరి దశలో పంటలు ఎండిపోయేవి. ఇటీవల వాగులో చెక్‌డ్యాం కట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో బోరుబావుల్లో నీటి మట్టం పెరిగింది. ఇప్పుడు రెండు పంటలకు ఢోకా లేదు.
– ఏనుగు రవి, రైతు, చిట్యాల్
వాగులపై చెక్‌డ్యాంలను కట్టడం వల్ల వాగు ఒడ్డుకు ఉన్న బీడు భూములన్నీ పంట పొలాలుగా మారిపోయాయి. ఫలితంగా భూముల ధరలు బాగా పెరిగాయి. నాకు మాటేగాం వద్ద గుండెగాం వాగు ఒడ్డున పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో వానకాలంలో పత్తి, సోయా, శనగ పంటలు వేసేవాళ్లం. చెక్‌డ్యాం కట్టిన తర్వాత బోరు వేస్తే 20 అడుగులకే నీళ్లు వచ్చాయి. ఇప్పుడు మక్క, పసుపు, వేరుశనగ వేశాను. దాదాపుగా పదెకరాలకు నీళ్లు సరిపోతున్నాయి. బీడు భూములు పచ్చని పంట పొలాలుగా మారడం వల్ల భూములకు డిమాండ్ పెరిగింది. ఇంకా రివిట్మెంట్ పనులు పూర్తికాలేదు.
– గణేశ్, రైతు, మాటేగాం, ముథోల్ మండలం