ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 15: మన ఊరు-మనబడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలకు వైభవం రానున్నదని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన, ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తాపట్నాయక్‌తో కలిసి ఆదిలాబాద్ మండలం భీంసరి ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. గ్రామస్తులు వారికి హారతిపట్టి, బొట్టుపెట్టి స్వాగతం పలికారు. పల్లెప్రకృతివనం, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశా రు. నర్సరీలు,ప్రకృతివనాల్లో ఉన్న మొక్కల పేర్లను అక్కడ బోర్డు ద్వారా ప్రదర్శించాలని ఆదేశించారు. ‘మన ఊరు-మన బడి’ పథకం సీఎం వినూత్న ఆలోచన అని తెలి పారు.ఈ కార్యక్రమం కింద శిథిలావస్థలోని పాఠశాలలు, అదనపు తరగతి గదుల అవసరం ఉన్నవాటికి ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. ఆ మేరకు నిర్మాణాత్మకంగా పను లు మొదలవుతాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు.
ఎదులాపురం, ఏప్రిల్ 15 : ప్రభుత్వం ద్వారా నిర్వహించే పనులు ప్రజలు మెచ్చేలా సౌకర్యవంతంగా ఉండేలా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి,విద్యాశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన ఆదిలాబాద్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కార్యదర్శి మాట్లాడారు. పాఠశాలల్లో అవసరమైన పనులను మన ఊరు- మన బడి కార్యక్రమం కింద ప్రతిపాదించాలని సూచించారు. ప్రభుత్వ భవనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇంజినీరింగ్ అధికారులపై ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణాలు ప్రతిపాదించాలని సూచించారు. కూల్చివేడయడం చివరి అంశంగా పరిశీలించాలన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించినప్పుడే విద్యార్థులు సక్రమంగా విద్యనభ్యసిస్తారని వివరించారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, గ్రామాభ్యుదయానికి ప్రజాప్రతినిధులు, అధికారులు తమ విధులు పూర్తి స్థాయిలో నిర్వహించడం ద్వారా ప్రజల మన్ననలు పొందవచ్చన్నారు. టీమ్ వర్క్‌తో పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ శరత్ సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలన్నారు. వైకుంఠధామాల్లో నీటి సరఫరా, విద్యుత్, మరుగుదొడ్లు నిర్మించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. విద్యుత్‌కు సోలార్ పవర్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో ప్రతిపాదించే పనులు శాశ్వత ప్రాతిపదికన ఉండేలా చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఏ శ్రీదేవసేన అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా రూ.7500 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సూచించిన మేరకు జిల్లాలో పనులు చేపడతామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, డీఆర్డీవో కిషన్, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, డీఈవో ప్రణీత, పంచాయతీ రాజ్ ఈఈ మహావీర్, డిప్యూటీ సీఈవో రాజేశ్వర్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, సర్పంచ్ మయూరి చంద్ర, ఎంపీడీవోలు, ఇంజినీరింగ్ అధికారులు, పంచాయతీ రాజ్ సిబ్బంది పాల్గొన్నారు.