నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 15: జిల్లాలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఏ 2 (సంగ్రహణాత్మక )పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. కరోనా, ఇతర విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసేందుకే ఈ ఎస్ఏ1,2 పరీక్ష ఎంతగానో దోహదం చేయనున్నాయి. కొవిడ్ కారణంగా గతంలో పదో తరగతి విద్యార్థులను ఈ పరీక్ష ఆధారంగానే పై తరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఈ పరీక్షలను కచ్చితంగా నిర్వహించాలని డీఈవో రవీందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలోని ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు తరగతుల వారీగా సామర్థ్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు దోహదపడనున్నాయి. జిల్లాలోని 579 ప్రాథమిక, 99 ప్రాథమికోన్నత, 145 ఉన్నత పాఠశాలలతో పాటు 18 కేజీబీవీల్లో పరీక్షను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి మొత్తం 64,604 విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా..205 ప్రైవేట్ పాఠశాలల్లోని 54,528 మందితో కలిసి మొత్తం 1,19,132 మందికి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఒకటి నుంచి ఆరో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఏడో తరగతి నుంచి పదోతరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2. నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించకుంటే పరీక్ష రాయనీయబోమని ఒత్తిడి తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.
జిల్లాలో ఎస్ఏ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని ఇప్ప టికే ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. 100 శాతం మంది వి ద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేలా ఉపాధ్యా యులు చూడాలి.
– రవీందర్ రెడ్డి,డీఈవో నిర్మల్