ప్రాణహితలో పుష్కరస్నానం.. సకల శుభదాయకం, సమస్త పాపహరణం, నిరంతరారోగ్యకరం, లోక కల్యాణదాయకం అని శాస్ర్తాలు చెబుతున్నాయి. దీనితోపాటు బాహ్య, అంతఃశరీర, ఆత్మశుద్ధి జరుగుతుందని వేదపండితులు చెబుతున్నారు. పన్నెండేళ్లకోసారి వచ్చే పవిత్రస్నానాలకు భక్తులు తండోపతండలుగా తరలివస్తున్నారు. ఈ మూడు రోజుల్లో దాదాపు 1.20 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదిలో కలెక్టర్ భారతి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద ఎమ్మెల్సీ దండె విఠల్ పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు.
కోటపల్లి, ఏప్రిల్ 15 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద గల ప్రాణహిత నది తీరానికి భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మూడో రోజైన శుక్రవారం వేకువజాము నుంచే పుష్కరఘాట్‌కు పుణ్నస్నానాలు ఆచరించడానికి భక్తులు పోటెత్తారు. మన రాష్ట్రంలోని భక్తులతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ మూడు రోజుల్లో సుమారు 1.20 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు. శుక్రవారం ఒక్కరోజే కోటపల్లిలో 50 వేలు, వేమనపల్లిలో 10 వేలు, కౌటాలలో రెండు వేల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. కలెక్టర్ భారతీ హోళికేరి-శంకర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో స్నానమాచరించారు.
ఇంకా.. మంచిర్యాల డీఎఫ్‌వో శివాని, మంచిర్యాల ఏసీపీ రేష్మి పెరుమాల్, మాజీ ఎమ్మెల్సీ సతీశ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం చేసి, పుష్కరుడికి ప్రత్యేక పూజలు చేశారు. భారీగా వాహనాలు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్ఐ రవికుమార్ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హేమ సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు సౌకిల్ స్వామి ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి చక్రతీర్థం చేయించారు. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ, తాగునీరు అందిస్తుండగా, సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం పంపిణీ చేశారు.
కౌటాల, ఏప్రిల్ 15 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తమ్మిడిహట్టి పుష్కరఘాట్ వద్ద ఎమ్మెల్సీ దండే విఠల్, కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వంశీ కృష్ణ, ఏఎస్పీ అచ్చేశ్వర్రావు పుణ్యస్నానాలు చేసి, ప్రత్యేక పూజలు చేశారు. పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమ్రం మాంతయ్య, ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, డీఎస్పీ కరుణాకర్, సీఐ బుద్ద్దే స్వామి, ఎస్ఐ మనోహర్, పుష్కర ఘాట్ ఇన్చార్జి వేణుగోపాల్ గుప్తా, ఎంపీడీవో నస్రుల్లా ఖాన్, తహసీల్దార్ రాంలాల్, ఎంపీవో శ్రీధర్ రాజు విధులు నిర్వహిస్తున్నారు.