ఇచ్చోడ, మే 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా పంచాయతీల రూపురేఖలు మార్చుతున్నది. ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, డంప్ యార్డులు నిర్మించి మౌలిక వసతులు కల్పిస్తున్నది. ఈ పనుల ద్వారా ఎంతో మందికి ఉపాధి చూపుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక చోట పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రకృతి వనాలు, అవెన్యూ ప్లాంటేషన్, నర్సరీల సంరక్షణకు వన సంరక్షకులు, వాచర్లను సర్కారు నియమించింది. పంచాయతీ పాలకవర్గం పర్యవేక్షణలో మొక్కలను సంరక్షిస్తున్నారు. గ్రామానికి సేవచేస్తూ వన సైనికులుగా ఉపాధి పొందుతున్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం కూలీలకు వరంగా మారింది. ఈ చట్టం ప్రకారం ప్రతి 400 మొక్కలకు ఒక వాచర్, పల్లె ప్రకృతి వనానికి ఒక వనమాలి ఉండాలని నిర్ణయించింది. దీంతో వేలాది మందికి ఉపాధి లభించింది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 467 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రతి జీపీలో నర్సరీ ఉంది. వీటి సంరక్షణకు 467 మంది వన సంరక్షకులు నియమితులయ్యారు. అలాగే జిల్లావ్యాప్తంగా 467 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాడ్డాయి.
వీటి సంరక్షణకు కూడా 467 మంది వాచర్లు నియమితులయ్యారు. వీరికి రోజుకు రూ.240 చొప్పున (ఆదివారం తప్పా) నెలకు రూ.6 వేలకు పైగా వేతనం అందుతున్నది. వీరంతా వయస్సు పెరిగిన వారే కావడంతో స్థానికంగా ఉపాధి దొరకడం ఉపశమనాన్నిచ్చింది. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను నాటారు. వాటికి కంచెలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. వన మాలీలు నిత్యం ఏదో ఒక గ్రామంలో తొలగింపు పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. గతంలో అడ్డా మీద కూలీలుగా, వలస కూలీలుగా ఉన్నవారు ప్రస్తుతం తమ స్వస్థలాల్లోనే ఉపాధి పొందుతున్నారు. మొక్కలు నాటుతూ, నీళ్లు పడుతూ వాటిని సంరక్షిస్తున్నారు. ఊరి బాగు కోసం పాటుపడుతున్నారు. అలాగే తమ కుటుంబానికి ఆర్థిక భరోసా కలిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాది మహారాష్ట్ర. అక్కడ పనులు లేవు. ముక్రా (కే)లో మా దగ్గరి చుట్టాలుండడంతో ఇక్కడికి వచ్చా. అక్కడి రేషన్, ఆధార్ కార్డులన్నీ ఇక్కడికి బదిలీ చేసుకొని ఇక్కడనే ఉంటున్నా. గీ ఊరును సర్కారు జీపీగా చేయడం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడంతో నాకు ఇక్కడనే ఉపాధి కల్పించింది సర్కారు. కేసీఆర్కు జీవితమంతా రుణపడి ఉంటా. ఊర్లో నాటిన మొక్కలకు నీళ్లు పోస్తూ వాటిని ఇష్టాంగా పెంచుతున్నా. కుటుంబంతో కలిసి ఉండడం ఆనందంగా ఉంది.
– వాగ్మారే సోఫాన్, ముక్రా (కే)
పల్లె ప్రగతి పనులతో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం. జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట పనులు జరుగుతూనే ఉన్నాయి. రోజూ కూలీలతో పాటు వనమాలీల వరకు అందరూ ఉపాధి పొందుతున్నారు. వన సంరక్షణ, మొక్కల పెంపకంపై అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చి, ఉపాధి కల్పిస్తున్నాం. నిత్యం ఏదో ఒక గ్రామాన్ని సందర్శిస్తున్నాం. వేసవిలో మొక్కల సంరక్షణపై చర్యలు తీసుకుంటున్నాం.
– వామనభట్ల రాంప్రసాద్, ఎంపీడీవో, ఇచ్చోడ