ఉమ్మడి జిల్లాలో రంజాన్ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. ప్రతి యేడాది పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేండ్ల నుంచి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఎవరి ఇంటి దగ్గర వారే ప్రార్థనలు చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభం ముగిసిపోవడంతో తిరిగి సామూహిక ప్రార్థనలకు ముస్లింలు సమాయత్తమవుతున్నారు. ఈద్గాల వద్ద చెత్తాచెదారం తొలగించి, రంగులు వేసి, షామియానాలు వేస్తున్నారు.
– దండేపల్లి/జైనూర్, మే 2
ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి ఈ మాసంలోనే వచ్చింది. ఉపవాస దీక్ష ద్వారా శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుంది. తద్వారా కామ, క్రోద, లోభ, మోహ, మద, మత్సర్యాలు అదుపులో ఉంటాయి. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాలు ఆచరిస్తారు. ఉదయాన్నే అన్న పానాదులు సేవించడాన్ని సహర్ అని, సాయంత్రం ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయడాన్ని ఇఫ్తార్ అంటారు.
నెల రోజుల పాటు రంజాన్ దీక్షలు పాటించిన ముస్లింలు మాసం అనంతరం షవ్వాల్ మాసపు మొదటి రోజున జరుపుకునే పండుగ ఈద్-ఉల్-ఫితర్. ఈ రోజు ఉదయాన్నే తలంటు స్నానాలు చేసి, నూతన వస్ర్తాలు ధరించి, అత్తరు పూసుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగ రోజు ‘షీర్ ఖుర్మా’ తీపి వంటకం అందరినీ నోరూరిస్తుంది. వాతావరణం అంతా దైవ విశ్వాసం, దైవ భీతి, దైవ విధేయతా భావాలు, ఉన్నత నైతిక పోకడలు, సదాచారాలతో అలరారుతుంటుంది. ఈ వాతావరణంలో చెడు అన్నది అణిగిపోయి, మంచి అన్నది పెరుగుతుంది. తామంతా ఒకటే అనే భావన, ప్రేమాభిమానాలు, సమైక్యతా సామరస్యాలు నెలకొల్పడంలో ఈ పండుగ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ పండుగ తర్వాత మరో ఆరు రోజుల పాటు షవ్వాల్ దీక్షలు పాటిస్తారు.
ఇస్లాం నిర్దేశించిన సిద్ధాంతాల్లో జకాత్ ఒకటి. జకాత్ అనగా దానం. ఇది మానవుల్లో త్యాగం, సానుభూతి, సహకారాలను పెంచుతుంది. ప్రతి ఒక్కరూ తమకున్న దానిలోనే అవసరమున్న వారికి కొంత ఇచ్చి ఆదుకోవాలి. తమ వద్ద ఉన్న బంగారం, వెండి, రొక్కం, ఈ సంవత్సరం పండించిన పంట, వ్యాపారం కోసం నిర్దేశించిన సరుకులు, చివరికి తమ వద్ద ఉన్న పశువులను వెలకట్టి అందులో నుంచి 2.5 శాతం విధిగా దానం చేయాల్సి ఉంటుంది. నిరుపేదలు సైతం ఆనందోత్సవాలతో పండుగ జరుపుకోవాలన్నదే జకాత్, ఫిత్రాల ముఖ్య ఉద్దేశం.
షవ్వాల్ నెల మొదటి తేదీ ఈద్-ఉల్-ఫితర్ పండుగ నాడు ప్రత్యేక ప్రార్థనలకు ముందు పేదలకు ఇచ్చే దానమే ఫిత్రా. అందుకే ఈ పండుగను ఈద్-ఉల్-ఫితర్ అంటారు. షరియత్ పరిభాష లో ఫిత్రా అంటే ఉపవాసాల పాటింపులో మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి. ఈ లోపాల పరిహారా ర్థం చేసేదే ఫిత్రా దానం. సమాజంలోని నిరుపేదలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు కూడా ఇతరులతో పాటు పండుగలో మంచి వస్ర్తాలు ధ రించి, రుచికరమైన వంటకాలు ఆరగించే వీలు క ల్పిస్తుంది. పావు తక్కువ రెండు సేర్ల గోధుమలు, తూకానికి సరిపడా పైకాన్ని కడు నిరుపేదలకు దైవం పేరిట ప్రతి ముస్లింలు దానం చేయాలి.
కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు ఈద్-ఉల్ ఫితర్ (రంజాన్) సామూహిక ప్రార్థనలకు ముస్లింలు దూరమయ్యారు. తమ తమ ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోవాల్సి వచ్చింది. అలాయ్ బలాయ్ చేసుకోవాలన్నా, ఒకరినొకరు పలుకరించుకోవాలన్నా, ఇంటింటికీ వెళ్లి బంధు మిత్రులకు పండుగ శుభాకాంక్షలు చెప్పాలన్నా ఇబ్బందికర పరిస్థితి. ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి బయటపడడంతో మంగళవారం జరుపుకునే పండుగలో సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. ఈద్గాల వద్ద ఉత్సాహంగా సందడి చేయనున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇమామ్ ఇచ్చే సందేశాన్ని (ఖుత్బా) వినే అవకాశం, వేడుకోలు (దువా), ఇతరుల తథాస్థు(ఆమీన్) అంటూ ఒకరినొకరు అలాయ్ బలాయ్ (ఆలింగనాలు) చేసుకొని తెలుపుకునే శుభాకాంక్షలు, ఆత్మీయ పలుకరింపులు ఇవన్నీ మళ్లీ రావడంతో ముస్లింలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.