కాళేశ్వరం జలాల రాకతో జిల్లా సస్యశ్యామలం కాబోతున్నదని, వచ్చే వానకాలం నాటికి లక్ష ఎకరాలకు నీరందించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో పల్లె, పట్టణ ప్రగతి, నీటి పారుదల ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డితోపాటు జిల్లా అధికారులతో మంత్రి సమీక్షించారు. రెండు, మూడు నెలల్లో కాళేశ్వరం నీరు ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, వేగవంతంగా కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రాంతాలకు సంబంధించి వసతుల కల్పనలో దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణతో పోటీ పడలేదని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులే ఇందుకు నిదర్శనమని తెలిపారు.24 గంటల కరంటు, ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న వనరులు, పథకాలతో ధాన్యం దిగుబడిలో తెలంగాణ పంజాబ్‌ను మించిపోయిందని తెలిపారు. ముందు జాగ్రత్తలతో విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.
భువనగిరి కలెక్టరేట్, ఏప్రిల్ 30 : వానకాలం నాటికి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు నీరందించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లాలో జరుగుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, నీటి పారుదల కార్యక్రమాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆయన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ పమేలాసత్పతి, అదనపు కలెక్టర్లు దీపక్‌తివారీ, డి.శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, నీటి పారుదల ఇంజనీర్లతో సమీక్షించారు. జిల్లాలోని 6మున్సిపాలిటీలు, 421గ్రామ పంచాయతీల్లో పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, తడి, పొడి చెత్త వేరు చేసే షెడ్లు కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. ప్రతి గ్రామపంచాయతీలోనూ ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లు, నర్సరీల ఏర్పాట్లు చేపట్టడం అభివృద్ధికి నిదర్శనమన్నారు.
వైకుంఠధామాల నిర్మాణాలను రెట్టింపు చేయడంతో పాటు, వాటిల్లో మౌలిక వసతుల కల్పనకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని పార్కులను ఆధునీకరించి పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంపునకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి మండలంలోనూ 5బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో ఇప్పటి వరకు 30కి పైగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూములున్న చోట సరైన నీటి వసతి కల్పించి అటవీ జాతి వృక్షాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నీటి పారుదలకు సంబంధించి కాళేశ్వరం, మల్లన్నసాగర్ కాల్వల నిర్మాణం పూర్తి చేసి బస్వాపూర్ కింద ప్రాంతానికి రెండు, మూడు నెలల్లో నీరందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన కాల్వల నిర్మాణం పూర్తవుతుందని, పంట కాల్వల డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం పూర్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం 400ఎకరాల భూసేకరణ చేయగలిగితే వచ్చే వానాకాలం నాటికి లక్ష ఎకరాలకు పైగా నీరందించే అవకాశం ఉందన్నారు.
దీనిపై సీఎం కేసీఆర్ యాదాద్రి శివాలయం ప్రారంభం రోజున ఇచ్చిన ఆదేశాల మేరకు తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా వచ్చే వానకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు మల్లన్నసాగర్ ద్వారా ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు నవాబుపేట రిజర్వాయర్‌తో గుండాల మండలానికి నీరందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
పల్లె, పట్టణ ప్రాంతాలకు సంబంధించి వసతులు, సౌకర్యాల కల్పనలో మన రాష్ట్రంతో పోటీపడే రాష్ట్రమే లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో 1నుంచి 10వరకు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశంలో ఏ రంగంలోనైనా తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. 24గంటల కరెంట్, ఇంటింటికీ మంచినీరు అందిస్తుందన్నారు.
ప్రతి రాష్ట్రంలోనూ మంచినీటి సమస్యలు ఉన్నాయన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి దిగుబడి అవుతున్న పంటనే చెబుతుందన్నారు. ఎవరెన్ని మాట్లాడినా తెలంగాణలో 50లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందన్నారు. పంట దిగుబడుల్లో తెలంగాణ పంజాబ్‌ను మించిపోయిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.