కోటపల్లి/వేమనపల్లి/కౌటాల, ఏప్రిల్ 21 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట, వేమనపల్లి.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద గత ప్రాణహిత నదీ తీరం తొమ్మిదో రోజైన గురువారం భక్తజనంతో కళకళలాడింది. అర్జునగుట్ట వద్ద ఎనిమిది రోజుల్లో 3.40 లక్షలు, తొమ్మిదో రోజు 40 వేల మంది వేమనపల్లి వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ట్రాన్ప్కో ఎస్ఈ రమేశ్‌బాబు, లోకాయుక్త జడ్జి జస్టిస్ ఆనంద్ రెడ్డి పుష్కరస్నానం ఆచరించారు.
వేమనపల్లి ప్రాణహిత నదిలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు. ఈ రోజు 26 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు దేవాదాయ అధికారులు తెలిపారు. ఘాట్ వద్ద మండల పార్టీ అద్యక్షుడు కోలి వేణుమాధవ్‌రావు నిత్యన్నదానంతో పాటు మజ్జిగ, పుచ్చకాయలు, తాగునీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆత్రం గణపతి, సర్పంచ్‌లు కుబిడె మధూకర్, కొండగొర్ల బాపు, గోగర్ల శ్రీనివాస్, తలండి స్వరూపారాణి, మోర్ల పద్మ, మండల కో- ఆర్డినేటర్ భీమయ్య, మాజీ ఎంపీపీలు వెంకటేశం, లింగగౌడ్, వైస్ ఉపాధ్యక్షుడు కుమ్మరి బాపు, నాయకులు సంతోష్, రజోక్, రవి పాల్గొన్నారు.
పుష్కర స్నానాల్లో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ కృష్ణ, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు పర్శ చంద్రశేఖర్, ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్‌లు పాల్గొన్నారు. పుష్కరాలకు వ చ్చిన భక్తులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వంశీ భోజనం వడ్డించారు. సత్యసాయి సేవా స మితి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చే శారు. కార్యక్రమాల్లో పుష్కర ఘాట్ ఇన్చార్జి వేణుగోపాల్ గుప్తా పాల్గొన్నారు..
అడవిలో దొరికే పాలపండ్లకు భలే గిరాకీ ఏర్పడింది. సహజ సిద్ధంగా దొరికే పాలపండ్లను అర్జునగుట్ట ప్రాణహిత నదితీరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. తెలంగాణలో మాత్రమే విరివిగా దొరికే వీటిని తినేందుకు భక్తులు ఇష్టపడుతున్నారు.
కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట ప్రాణహిత పుష్కరాలకు వచ్చే భక్తులకు చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుండడం, ఎండ వేడికి అధికంగా ఉంటుండడంతో భక్తుల వద్దకు వెళ్లి ప్యాకెట్లు అందచేశారు.