తాంసి, ఏప్రిల్ 20 : రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటుందని ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో శనగల కొనుగోళ్లను బుధవారం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శనగల కొనుగోలు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కలిసిన మరుసటి రోజు నుంచే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని, అందుకు నిదర్శనం శనగల కొనుగోళ్లేనని చెప్పారు. కొనుగోళ్ల సందర్భంగా రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని సంబంధిత మార్కెట్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వాల హయాంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి దుకాణాల ఎదుట ఎదురుచూసే పరిస్థితి ఉండేదన్నారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, జైనథ్ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు తదితరులు ఉన్నారు.