“యాసంగి సీజన్లో పండిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర సర్కారే కొనుగోలు చేస్తది. కేంద్ర ప్రభుత్వానికి వడ్లు కొనాలని విన్నవించినా, రైతుల తరఫున ఢిల్లీలో దీక్ష చేసినా పట్టించుకోవడం లేదు. కార్పొరేట్లకు, దొంగలకు లక్షల కోట్లు మాఫీ చేస్తుంది గానీ, 60 లక్షల మంది రైతుల కోసం మూడున్నర వేల కోట్లు ఖర్చు చేయలేకపోతున్నది. మోదీ సర్కారుకు రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతున్నది. రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మవద్దు.”
– తాజాగా విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు
కేంద్ర సర్కారు కక్ష గట్టినా.. కమలనాథులకు కర్షకులపై ప్రేమలేకపోయినా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధాన్యం వద్దన్నా.. మంత్రి పీయూష్ గోయల్ నూకలు తినండని తెలంగాణ ప్రజలను అవహేళన చేసినా.. కేసీఆర్ మాత్రం రైతన్నలను కడుపున పెట్టుకొని చూసుకుంటున్నడు. యాసంగి వడ్ల కొనుగోళ్లపై కేంద్రం కొర్రీలు పెట్టినా రాష్ట్ర సర్కారు రైతన్నలకు అభయం ఇచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1.48 లక్షల ఎకరాల్లో సాగవగా.. 3.06 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుంది. ఈనెల 25 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానుండగా.. 450 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మద్దతు ధర రూ.1960 చెల్లించనుండగా.. రూ.500 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దం డుగలా ఉండగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వా త తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో పండుగలా మారింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, పంటల కొనుగోళ్లు వంటి పథకాలు రైతులకు ప్రయోజనకరంగా మారాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో వరి, పత్తి, కంది, సోయాబిన్.. యాసంగిలో వరి, శనగ, గోధుమ, జొన్న పంటలను రైతులు పండిస్తారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నది. వానకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రైతులు పండించిన వడ్లు 5.10 లక్షల మెట్రిక్ టన్నులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇచ్చింది. యాసంగి వడ్లను కొనుగోలు చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శించడంతో రైతులు నష్టపోకుండా తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంది. యాసంగి వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.
యాసంగిలో రైతులు వరిని సాగు చేయవద్దంటూ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఉమ్మడి జిల్లాలో సాగు తగ్గింది. యాసంగిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1.48 లక్షల ఎకరాల్లో రైతులు పంటను వేశారు. మంచిర్యాల జిల్లాలో 72 వేల ఎకరాలు, నిర్మల్‌లో 68 వేలు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 7,745, ఆదిలాబాద్‌లో 338 ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశారు. సకాలంలో సాగునీరు అందడంతో ఎకరాకు 22 నుంచి 24 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. మంచిర్యాల జిల్లాలో 1.40 లక్షల మెట్రిక్ టన్నులు, నిర్మల్‌లో 1.50 లక్షలు, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 15,490, ఆదిలాబాద్‌లో 676 మెట్రిక్ టన్నుల పంట విక్రయానికి రానుంది. ఈ నెల 25 నుంచి ఉమ్మడి జిల్లాలో వడ్ల కొనుగోళ్లు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులు, మిల్లర్లు, లారీల యజమానులతో సమావేశం నిర్వహించి పకడ్బందీగా పంట కొనుగోళ్లు జరపాలని సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లోనే కాంటాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 450 పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. క్వింటాలుకు రూ.1,960తో రూ.500 కోట్ల పంటను ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. డబ్బులు కూడా వెంటవెంటనే రైతుల ఖాతాల్లో వేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ అధి కారులు ఇతర పంట లు సాగు చేయాలని చెప్పినా సరిపడా నీళ్లు ఉండడంతో నా కున్న ఎకరం పొలం లో వరి వేసిన. వడ్లు కొనమని కేంద్ర ప్ర భుత్వం మొండి కేయడం తో సీఎం కేసీఆర్ రైతులను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో కేం ద్రాలు ఏర్పాటు చేయిస్తున్నడు. దీంతో మాకు భరోసా వచ్చింది. యాసంగి వడ్లు కొంటా మని ప్రకటించిన సీఎం కేసీఆరే రైతు బాంధ వుడు. కేంద్రం రైతులను చిన్న చూపు చూస్తు న్నది.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండ గా ఉంటున్నది. ఏ ఒక్క రైతు నష్ట పోవద్దనే యాసంగిలో ప్రతి గింజను ప్రభుత్వ మే కొని రూ. 1960 మద్దతు ధర ఇస్తామని సీఎం చెప్పడం సంతోషంగా ఉంది. రైతులకు అండ గా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తెలంగాణ ప్రభు త్వం వడ్లు కొనేందుకు ముందుకు రాక పోతే దళారుల చేతిలో పంట పెట్టి ఆర్థికంగా నష్ట పోయే వాళ్లం. అప్పుల పాలు అయ్యే వాళ్లం. రైతులంతా సీఎంకు రుణ పడి ఉంటాం.
కొండ్ర శ్రీనివాస్, రైతు, గొడిసేర్యాల, దస్తురాబాద్ మండలం
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రైతులకు మరింత నమ్మకం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. యాసంగి వడ్లు కొనాలని రైతులు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత పోరాడినా కేంద్రంలోని బీజేపీ సర్కారు పట్టించుకోలేదు. రైతుల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ యాసంగి వడ్లు కొనేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చిండ్రు. రైతులను ఇబ్బందులు పెట్టిన ఏ సర్కారు మనుగడ సాధించలేదని కేంద్రానికి తెలిసేలా భవిష్యత్‌లో బుద్ధి చెబుతాం. బీజేపీ నాయకులు, ఢిల్లీలో ఓ మాట, ఇక్కడో మాట మాట్లాడుతున్నరు. ముఖ్యమంత్రి చొరవతోనే ఆ యాసంగి వడ్లు సర్కారు కొనుగోలు చేస్తుండడంతో మా కష్టాలు తీరినట్లే.
జీ మధు, రైతు, దిలావర్పూర్
నా పేరు ముత్తన్న. మాది నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని న్యూలోలం. నాకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో మూడెకరాలు వరి, మరో రెండెకరాల్లో మక్క వేశా. ఎకరాకు వరి దిగుబడి 23 క్వింటాళ్లు వస్తుందని భావిస్తున్న. మూడెకరాలకు కలిసి దాదాపు 69 క్వింటాళ్లు రావచ్చు. సర్కారు మద్దతు ధర క్వింటాలుకు రూ.1,960 ప్రకటించింది. రూ.1.35 లక్షలు వస్తాయనుకుంటున్న. కేంద్రం యాసంగి వడ్లు కొనమని ప్రకటించడంతో భయపడ్డాం. వడ్లు ఎట్లా అని దిగాలు చెందినం. ఇంతలోనే కేసీఆర్ సారు మాకు అండగా నిలిచిండు. ధాన్యం కొంటమని భరోసా ఇచ్చిండు. ఎప్పటికైనా కేసీఆర్ సారు రైతు పక్షపాతి.