నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 20 : సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కారు ముందుకెళ్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఆడిటోరియం భవనంలో బుధవారం ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. బతుకమ్మ సందర్భంగా మహిళలకు సారె పంపిణీ చేస్తున్నట్టుగానే రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పేదలకు దస్తులు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి నిర్మల్ జిల్లాకు 6వేల గిఫ్ట్ ప్యాక్‌లు వచ్చాయని తెలిపారు.
ఇందులో నిర్మల్ నియోజకవర్గానికి 2 వేలు, ముథోల్ నియోజకవర్గానికి 2500, ఖానాపూర్ నియోజకవర్గానికి 1500 కేటాయించినట్లు వెల్లడించారు. నిర్మల్‌కు అదనంగా వెయ్యి గిఫ్ట్‌ప్యాక్‌లు తెప్పించామని తెలిపారు. మసీదుల వారీగా పేదలను ఎంపికచేసి, అందించామన్నారు. అనంతరం పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేసి, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో రమేశ్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజి రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదాముత్యం రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, డీడబ్ల్యూవో స్రవంతి, అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని సోమవార్‌పేట్ ఖిల్లా గుట్టలో నూతనంగా నిర్మించిన మహంకాళి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొనగా, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత నెలకొంటుందన్నారు. నిర్మల్ ఆధ్యాత్మిక జిల్లాగా రూపుదిద్దుకున్నదని, దాదాపు 600కు పైగా ఆలయాలను నిర్మించుకున్నామని చెప్పారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, నరేందర్, నాయకులు ఆకుల రామకృష్ణ, ఆకుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్, ఏప్రిల్ 20 : సారంగాపూర్ మండలం గోపాల్పేట్ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధచూపుతున్నదన్నారు. అడెల్లి పోచమ్మ ఆలయానికి రూ.6 కోట్లు మంజూరు చేసినట్లు, ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోనున్నట్లు తెలిపారు. మంత్రి వెంట ఆయన సోదరుడు అల్లోల మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, ఆడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, సర్పంచ్ లింగవ్వ, నాయకులు గంగారెడ్డి, సాయన్న, రాజేశ్వర్‌రావు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 20 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి లిప్టు ఇరిగేషన్ స్కీం ప్యాకేజీ 27లో భూములు కోల్పోయిన 63 మంది రైతులకు కలెక్టరేట్లో మంత్రి చెక్కులను అందజేశారు. కిషన్‌రావుపేటలో 35, కదిలిలో 15, లింగాపూర్‌లో 9, ఆరెపల్లిలో 3, మాడేగాంలో ఒక్కరికి మొత్తం రూ.2,01,76,087 విలువ గల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత రైతులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. రాష్ట్ర సర్కారు నీటిపారుదల రంగానికి ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొన్నారు. కాళేశ్వరం నీటిని శ్రీరాంసాగర్‌కు మళ్లించి నిర్మల్ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలను తడిపేందుకు ప్యాకేజీ 27 పూర్తయిందన్నారు. పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, వచ్చే ఏడాదిలో నీటిని అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ రాంబాబు, డిప్యూటీ కలెక్టర్ స్రవంతి, నీటి పారుదలశాఖ ఈఈ రామారావు, తహసీల్దార్లు హేమబింధు, కిరణ్మయి, అధికారులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మామడ, ఏప్రిల్ 20 : మండలంలోని పొన్కల్‌లో రూ.10 లక్షలతో నిర్మించిన గంగపుత్ర కమ్యూనిటీ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. గంగపుత్రుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నదని అన్నారు. ఈ సంఘం ఆర్థికంగా ఎదిగేందుకు కమ్యూనిటీ హాల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇలాంటి పెద్ద హాలు జిల్లాలోనే లేదన్నారు. పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే గంగపుత్రులకు అధిక లాభాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమేశ్వర్, డీసీసీబీ డైరెక్టర్ హరీశ్‌రావు, ఎంపీటీసీ బొజ్జ రాధ, వైస్ ఎంపీపీ లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, గంగపుత్ర సంఘం గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు నవీన్‌రావు, శేఖర్, నర్సయ్య, రవి, లింగన్న, రాజేశ్వర్ పాల్గొన్నారు.
అనంతపేట్ గ్రామంలో రూ.1లక్షల సీజీఎఫ్ నిధులతో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమలత, నాయకులు గంగాధర్, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.