కోటపల్లి/కౌటాల/వేమనపల్లి, ఏప్రిల్ 20: ప్రాణహిత పుష్కరాలకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఏడో రోజైన బుధవారం ఉదయం నుంచే భక్తులు ప్రాణహిత నదికి పోటెత్తారు. అర్జున గుట్ట తీరం వద్ద 70 వేలకు పైగా, తుమ్మిడి హట్టి తీరం వద్ద 3వేల మంది, వేమనపల్లి తీరం వద్ద వెయ్యి మంది పుణ్యస్నానాలు ఆచరించారు. అర్జున గుట్ట వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ వీ శ్రీనివాస్, డీఎస్పీ నర్సయ్య, కాటారం డీఎస్పీ బాణాల కిషన్, రిటైర్ట్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుబ్బారావ్ పుణ్య సాన్నాలాచరించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హట్టి వద్ద ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
ఏర్పాట్లను ఘాట్ ఇన్చార్జి వేణుగోపాల్ గుప్తా, ఎంపీవో శ్రీధర్ రాజు పర్యవేక్షించారు. వేమన పల్లి పుష్కర ఘాట్‌లో మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ లక్ష్మీశ్యాంప్రసాద్ దంపతులు పుష్కర స్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్‌యాదవ్, హైదరాబాద్ హెచ్‌సీఏ ఈసీ మెంబర్ నర్సింగ్‌రావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కోదాటి ప్రదీప్, కోచ్ కొరంగ ప్రదీప్ పుణ్యస్నానాలు ఆచరించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌రావు దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. ధర్మపురి బ్రహ్మణ సంఘం కులస్తులు లక్ష వత్తులు వెలిగించారు. నీల్వాయి ఎస్ఐ నరేశ్ బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ మధుసూదన్, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్ ఉన్నారు. అర్జున గుట్ట ప్రాణహిత వద్ద పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లిఖార్జున స్వామి ఆలయం ఆధ్వర్యంలో హారతి కార్యక్రమం నిర్వహించారు. ప్రాణహిత నదికి పూజలు నిర్వహించి కుంకుమ, పసుపు, సారెలను నైవేద్యంగా సమర్పించారు.
అర్జునగుట్ట ప్రాణహిత వద్ద చిరు దుకాణాల నిర్వాహకులు చెలిమె తోడి అందులోంచి వచ్చే నీటిని తాగుతున్నారు. ఎండ వేడమికి ఈ నీరు చల్లగా ఉంటుందని, ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని వారు చెబుతున్నారు.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్
కోటపల్లి, ఏప్రిల్ 20: భానుడు భగభగ మండుతున్నాడు. ప్రాణహితా తీరానికి పుణ్య స్నానాలకు వచ్చే భక్తులు ఇలా నెత్తిన ఏదో ఒకటి పెట్టుకొని వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. బుధవారం ఇద్దరు భక్తులు ఇలా స్టూళ్లు పెట్టుకొని కనిపించారు.
నాపేరు రాంచరణ్. మాది వరంగల్. పుష్కర స్నానం కోసం కుటుంబమంతా అర్జునగుట్టకు వచ్చాం. ఇక్కడ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం గోదావరిలో పుష్కర స్నానం చేసిన. ఇప్పుడు ప్రాణహిత పుష్కరాలంటే వచ్చిన. చాలా ఎంజాయ్ చేశా. ముందుగానే ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందనిపించలేదు. నీటిలో ఈత కొట్టడమంటే చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత ఇప్పుడది ఎంజాయ్ చేసిన.
కోటపల్లి, ఏప్రిల్ 20: అర్జునగుట్ట ప్రాణహితా తీరం వద్ద సిబ్బంది పారిశుధ్య పనులు చకచకా చేపడుతున్నారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతుండగా, తీరంలో వదిలేసే వస్తువులు, పూజా సామగ్రిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఎంపీవో ముల్కల్ల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, పారిశుధ్య సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి అంతా శుభ్రం చేస్తున్నారు.