మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేర్చేందుకు గోదారమ్మ తరలిరానున్నది. ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలుపడంతోపాటు రూ.1,658 కోట్లు మంజూరు చేయడంతో పనుల ప్రారంభమే మిగిలింది. త్వరలోనే ఆ దిశగా అడుగులు పడనుండగా, ఇందుకు సీఎం కేసీఆర్ స్వయంగా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో భారీ లిఫ్ట్‌కు రూపకల్పన జరగగా, ప్రభుత్వం పచ్చజెండా ఊపడం రైతాంగాన్ని ఆనందంలో ముంచెత్తింది. పథకం పూర్తయితే నియోజకవర్గం సస్యశ్యామలం కానుండగా.. తాగు, సాగునీటి కష్టాలకు చెక్ పడనుంది. దీంతో రైతాంగం, స్థానిక ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
చెన్నూర్, ఏప్రిల్ 17 : చెన్నూర్‌లో భారీ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ.1,658 కోట్లతో చేపట్టే పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గానికి తలాపునే గోదావరి, ప్రాణహిత జీవనదులు ఉన్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా సాగు, తాగు నీటి ఇక్కట్లు ఎదురయ్యాయి. చెన్నూర్ ఎమ్మెల్యేగా బాల్క సుమన్ ఎన్నికైన వెంటనే నియోజకవ ర్గ భౌగోళిక స్వరూపంపై ఆరా తీశారు. గోదావరిపై రెండు, ప్రాణహితపై ఒక ఎత్తిపోతల పథకం నిర్మిస్తే లక్షకు పైగా ఎకరాలకు సా గు నీరు, మూడు మున్సిపాలిటీలు, 103 గ్రామాలకు తాగు నీరు అందించాలని సుమన్ సంకల్పించారు. ఈ మేరకు ఇంజినీర్లతో చర్చించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి, ఎత్తిపోతల పథకాన్ని మం జూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పలుసార్లు అసెంబ్లీ సమావేశాల్లోనూ అంశాన్ని లేవనెత్తారు. ఈ ఎత్తిపోతల పథకం సర్వే కోసం ప్రభుత్వం రూ.8.88 కోట్లు కూడా మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఈ నెల 12న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి రూ 1,658 కోట్లు మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది. ఇక ఈ భారీ ఎత్తిపోతల పథకం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధిలో ఇది కీలక అడుగుగా స్థానిక ప్రజలు భావిస్తున్నారు. ఈ ఎత్తిపోల పథకం ద్వారా 10 టీఎంసీల గోదావరి నీటిని వాడుకొని నియోజకవర్గంలోని చెరువులను నింపనున్నారు. చెరువుల నుంచి గ్రావిటీ కాలువల ద్వారా దాదాపు 90 వేల పైచిలుకు ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. అలాగే నియోజకవర్గంలోని చెన్నూర్, మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలతోపాటుగా చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లోని 103 గ్రామాలకు తాగు నీరు అం దించనున్నారు. మూడు పంటలకూ (అన్ని కాలాల పాటు) సాగు నీరు అందనుండడంతో నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది.
మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్‌పై కోటపల్లి మండలం ఆల్గాం గ్రామం వద్ద ప్రాణహితపై ఎత్తి పోతల పథకాన్ని నిర్మించనున్నారు. తద్వా రా మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజ్ బ్యాక్ వాటర్ నుంచి 16 కిలో మీటర్ల పైపులైన్ ద్వారా 30 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తి పోసి శంకరాపూర్ చెరువును నింపుతారు. ఇక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 23 చెరువులను నింపుతారు. వీటి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మండలంలోని 16,370ఎకరాలకు నీటిని అందించనున్నారు.
అన్నారం (సరస్వతీ) బ్యారేజ్‌పై చెన్నూర్ మండలం నర్సక్కపేట గ్రామం వద్ద గోదావరి నదిపై ఎత్తి పోతల పథకాన్ని నిర్మించనున్నారు. దీని ద్వారా అన్నారం (సరస్వతీ) బ్యారేజ్ బ్యాక్ వాటర్ నుంచి 16కిలో మీటర్లు పైప్‌లైన్ ద్వారా 50మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తి పోసి భీమారం మండలంలోని మద్దికల్ చెరువును నింపుతారు. ఈ చెరువు గ్రావిటీ కెనాల్ ద్వారా చెన్నూర్ మండలంలోని 18 చెరువులు, కోటపల్లి మండలంలోని 9 చెరువులు, భీమారం మండలంలోని 11 చెరువులను నింపుతారు. ఈ చెరువుల నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా చెన్నూర్, భీమారం, కోటపల్లి మండలాల్లోని 48,208ఎకరాలకు సాగు నీటిని అందించనున్నారు.
సుందిళ్ల(పార్వతీ) బ్యారేజ్‌పై జైపూర్ మండలం టేకుమట్ల గ్రామం వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. దీని ద్వారా సుందిళ్ల(పార్వతీ) బ్యారేజ్ బ్యాక్ వాటర్ నుంచి 17 కిలో మీటర్లు పైపు లైన్ల ద్వారా 53 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తి పోసి మందమర్రి మండలంలోని పొన్నారం చెరువును నింపుతారు. ఇక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మందమర్రి మండలంలోని 7 చెరువులు, జైపూర్ మండలంలోని 21చెరువులను నింపుతారు. ఈ చెరువుల నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా జైపూర్, మందమర్రి మండలాల్లోని 25,423 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు.
చెన్నూర్ నియోజకవర్గ ప్రజల కోసం భారీ ఎత్తిపోతల పథకానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. సాగు నీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూశా. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తరతరాల సమస్యను తీర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించా. చెన్నూర్ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను సీఎం కేసీఆర్‌ను స్వయంగా కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లా. ముఖ్యమంత్రి పెద్ద మనస్సుతో అర్థం చేసుకున్నారు. వెంటనే ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ 8.88 కోట్లు మంజూరు చేసి సర్వేకు ఆదేశించారు.
సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు ప్రాజెక్టు డిటైల్డ్ రిపోర్టును (డీపీఆర్) ప్రభుత్వానికి నివేదించారు. ఏప్రిల్ 12న హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ సమావేశంలో ఈ భారీ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రూ.1,658 కోట్ల నిధుల మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. చెన్నూర్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం ఇదే మొదటి సారి. త్వరలోనే ఈ ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేస్తారు.
– బాల్క సుమన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే
భీమారం, ఏప్రిల్ 17 : భీమారం మండలంలోని రైతులమంతా సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం , పార్వతీ బ్యారేజ్ నుంచి భీమారానికి ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించేందుకు క్యాబినేట్ మీటింగ్ తర్వాత సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో మా రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ పథకం ద్వారా నాకున్న రెండు ఎకరాల్లో పంటలు పండిస్తా. ఇప్పుడు నీరు లేక ఇబ్బందిగా ఉండి పంటలు సైతం పండిస్తలేను. ఎత్తిపోతల పథకం ద్వారా నీరు మా మండలానికి వస్తే మా పొలానికీ అందుతుంది. రైతులు సైతం పంటలు వేసుకుంటారు. మా ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు సైతం మా మండల రైతులు, మేము రుణపడి ఉంటాం.
– బండి సంపత్, రైతు, భీమారం
జైపూర్, ఏప్రిల్ 17: కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతీ బ్యారేజీ నుంచి జైపూర్, మందమర్రి మండలాల్లోని 25,423 ఎకరాలకు సాగునీరందించేందుకు మా ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన కృషి అభినందనీయం. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ప్రజలంతా రుణపడి ఉంటారు. గతంలో ఎంతో మంది మంత్రులుగా చేసిండ్లు, ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. కానీ జేబులు నింపుకున్నరే తప్పా ఈ ప్రాంత అభివృద్ధి గురించి పట్టించుకోలే. ఐదేండ్లలో 60 యేండ్లలో చేయని పనులు సుమన్ చేసిండు సుమన్‌కు మేమంతా రుణపడి ఉంటాం.
– గోలి రాములు, రైతు, రామారావుపేట(జైపూర్)
మందమర్రి, ఏప్రిల్ 17: చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపడం హర్షణీయం. దీంతో నియోజక వర్గ పరిధిలోని ఐదు మండలాలతో పాటు మందమర్రి పట్టణానికి తాగునీరందించే మహత్తర పథకం ఇది. దీనివల్ల గడపగడపకూ గంగమ్మ తల్లి చేరనుంది. చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి క్యాబినేట్ ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేయడంతో ప్రజల చిరకాల వాంచ తీరినట్లయ్యింది. ఎత్తి పోతల పథకం మంజూరుకు కృషి చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్‌కు రుణపడి ఉంటాం. – తోకల నిరోష, మందమర్రి మున్సిపాలిటీ
కోటపల్లి, ఏప్రిల్ 17 : చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ క్యాబినేట్ అమోదం తెలి పి రూ.1658 కోట్లు మం జూరు చేయడం హర్షణీయం. విప్ బాల్క సుమన్ ప్రత్యేక కృషితో పథకానికి నిధులు మం జూరయ్యాయి. ఈ పథకం పూర్తయితే చెన్నూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 90 వేల ఎకరాలకు పైగా సాగు నీరు అందనుంది. ఈ పథ కం ద్వారా మూడు పంటలు సులభంగా పండుతాయి. రైతులు ఎదుర్కొన్న సాగునీటి కష్టాలు తీరుతాయి. – దుర్గం కృష్ణదాస్, కొల్లూరు(కోటపల్లి)
మందమర్రి, ఏప్రిల్ 17 : మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి కష్టాలున్న విషయం అందరికీ తెలిసిందే. వేసవి వస్తే ఆ కష్టాలు మరిన్ని పడాల్సిన దుస్థితి. వారం రోజులకు ఒకసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతుంది. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మా కష్టాలను గుర్తించి వాటిని తొలగించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ఒప్పించి చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆమోదం తెలిపేలా చేసిండు. నిధులు కూడా మంజూరు కావడంతో ఇక మా తాగునీటి కష్టాలు తీరినట్టే.
– ఉప్పులేటి గోపిక, మందమర్రి మున్సిపాలటీ
మందమర్రి, ఏప్రిల్ 17: చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి క్యాబినేట్ ఆమోదం తెలుపడంతో పాటు నిధులు మంజూరు కావడంతో రైతుల కడగండ్లు తీరనున్నాయి. మందమర్రి మున్సిపాలిటీ పారిశ్రామిక ప్రాంతం అయినప్పటికీ పరిసర ప్రాంతాల్లో పలువురు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక రైతుల భూముల్లో గంగమ్మ తల్లి పరుగులు పెట్టనుంది. ఏటా రెండు పంటలు పండించే అవకాశం కలుగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు రుణపడి ఉంటాం.
– మాసు వెంకటేశ్, మందమర్రి మున్సిపాలిటీ
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 17: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి కోసం తిప్పలు ఉండేవి. వేసవి వచ్చిందంటే ఈ ఇబ్బందులు చెప్పలేనివి. రెండు రోజులకు ఒకసారి నల్లా నీళ్లు వ స్తుండేవి. చెన్నూర్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ అన్న మహిళల నీటి కష్టాలను తొలగించేందుకు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపేలా ఒప్పించిండు. మంత్రి మండలి సమావేశంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. నిధులు కూడా మంజూరు చేయడం ద్వారా మా మహిళల నీటి కష్టాలు ఇక తీరిపోయినట్లే.
– ఓదెల సతీశ్, రామకృష్ణాపూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీ
రామకృష్ణాపూర్, ఏప్రిల్ 17 : చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎప్పటికీ మరిచిపోరు. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి అహర్నిశలు అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని చెన్నూర్‌ను సుమన్ అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నారు. చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌తో ఈ ప్రాంత స్వరూపమే మారిపోతుంది. ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో ఎమ్మెల్యే బాల్క సుమన్ చెరగని ముద్రవేసుకున్నారు. దానికి నిదర్శనం ఆయన చేసిన అభివృద్ధి పనులే. చెన్నూరు ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపిన కేసీఆర్‌కు, ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– వెలమారెడ్డి రాంరెడ్డి, రామకృష్ణాపూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీ
చెన్నూర్, ఏప్రిల్ 17 : చెన్నూర్ నియోజకవర్గం చుట్టూ జీవ నదులైన గోదావరి, ప్రాణహిత ఉన్నాయి. అయినప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యంతో సాగు, తాగు నీటికి నోచుకోలేదు. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ సమస్యలను పరిష్కరించాలని కంకణం కట్టుకున్నారు. ఎత్తిపోతల పథకాలను నిర్మించి నియోజకవర్గం మొత్తం సాగు, తాగు నీరు అందించాలని రూపకల్పన చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ సార్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించారు. దీంతో సీఎం కేసీఆర్ సార్ ఎత్తిపోతల పథకానికి రూ 1,658 కోట్లను మంజూరు చేశారు. ఎమ్మెల్యే సుమన్ కృషితో సాగు, తాగు నీటి కష్టాలు తీరనున్నాయి. నియోజవకర్గంలోని రైతులు, ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వానికి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటారు.
– బజ్జూరి మహేశ్, రైతు, చెన్నూర్ మున్సిపాలిటీ
చెన్నూర్ రూరల్, ఏప్రిల్ 17 : ఎత్తిపోతల పథకంతో వ్యవసాయానికి ఇక ఢోకా ఉండదు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సహకారంతో చెన్నూర్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లను అందించడం చాలా సంతోషంగా ఉంది. అన్నారం (సరస్వతీ ) బ్యారేజ్ నుంచి చెన్నూర్, కోటపల్లి, భీమారం మండలాలకు సుమారు 50 వేల ఎకరాలకు నీళ్లు అందించడంతో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు పంటలు పండిస్తారు. సీఎం కేసీఆర్ వల్ల వ్యవసాయ రంగానికి చాలా ప్రాధాన్యం పెరిగింది. సీఎం కేసీఆర్ సారుకు రైతులమంతా రుణపడి ఉంటాం. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రైతులకు ఎలాంటి లాభం లేదు అన్న ప్రతిపక్ష నేతలకు ఎత్తిపోతల పథకం సమాధానం చెబుతుంది.
– సంగెం శ్రీనివాస్, రైతు, కొమ్మెర(చెన్నూర్)