దేశాభివృద్ధికి పల్లెలు పట్టుగొమ్మలు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణలో పల్లెల సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పల్లె ప్రగతిని అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమంతో గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం నెలకొనడమే కాకుండా.. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందుతున్నాయి. పంచాయతీలు కూడా ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) పల్లెప్రగతి ప్రతిరూపంగా నిలుస్తున్నది.
ఈ గ్రామంలో పంచాయతీ పాలకవర్గం, స్థానికుల భాగస్వామ్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ గ్రామం ఈ యేడాది జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుకు ఎంపికైంది. సేంద్రియ ఎరువుల తయారీతో గ్రామ పంచాయతీకి ఆదాయం పెరుగుతున్నది. పల్లెప్రగతి కార్యక్రమాల అమలు కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ముక్రా(కే)ను సందర్శిస్తారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 17 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ నుంచి నిర్మల్‌కు వెళ్లే జాతీయ రహదారి 44 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఇచ్చోడ మండలం మక్రా(కే) గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో 160 కుటుంబాలు, 700 జనాభా ఉంది. పల్లె ప్రగతికి ప్రతిరూపంగా నిలుస్తున్నది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మం డలం ముక్రా(కే) గ్రామం. ప్రజల భాగస్వామ్యం తో ఈ పల్లె ప్రగతిబాటలో పయనిస్తున్నది. గతం లో నగదు రహిత గ్రామంగా ఉన్న ముక్రా (కే)లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియడంతో పాటు సర్కారు పథకాలు పక్కాగా అమలవుతున్నాయి. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంత ఉంది. స్థానికులు ప్రభుత్వ పథకాల అమలులో స్వచ్ఛందంగా భాగస్వాములవుతారు.
గ్రా మాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ పాలకవర్గం పంచాయతీరాజ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నది. 700 జనాభా ఉన్న ఈ పల్లె ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియో పర్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామస్తులకు ఎలాంటి సమస్య వచ్చినా అందరూ కలిసి చర్చించుకొని పరిష్కరించుకుంటారు. గ్రామాభివృద్ధి కమిటీలో రూ1.25 కోట్లు జమ చేశారు. పంటల సాగుకోసం రైతులు, ఆడ పిల్లల వివాహాలు, ఆరోగ్యపరమైన ఖర్చులు, విద్యార్థుల ఉన్నత చదువులకు రుణాలు ఇస్తున్నారు. వడ్డీ డబ్బులను గ్రామాభివృద్ధి పనులకు వినియోగిస్తున్నారు. గ్రామంలో పిల్లల చదువులు, ఆడ పిల్లల వివాహాలకు గ్రామాభివృద్ధి కమిటీ అండగా నిలుస్తున్నది. కరోనా సమయంలో సైతం పాలక వర్గం, గ్రామస్తులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో మూ డు విడుతల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న ముక్రా(కే) పలు అవార్డులనూ సొంత చేసుకుంది. నగదు రహిత గ్రామంగా, జీవవైవిధ్య, స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా ఓడీఎఫ్‌ను అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల మక్రా(కే)కు మరో పురస్కారం అందుకుంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ముక్రా(కే)కు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారం ( జనరల్ విభాగం) లో లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు ముక్రా(కే) అభివృద్ధిని ప్రశంసించారు. గ్రామంలో అమలువుతున్న పల్లెప్రకృతి పనులను సందర్శించడానికి అధికారులు, ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులు ఇక్కడికి వస్తుంటారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మా గ్రామంలో విజయవంతంగా అమలు చే స్తున్నాం. పాలకవ ర్గం, స్థానికుల సహకారంతో ఆదర్శ గ్రా మంగా తీర్చిదిద్దాం. గ్రామంలో పరిశుభ్రత, పచ్చదనం విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నాం. సేంద్రియ ఎరువుల తయారీతో పంచాయతీకి ఆదాయం వస్తున్నది. గ్రామస్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నాం. పల్లెప్రగతి కారణంగా పలు అవార్డులు కూడా వచ్చాయి.
మీనాక్షి గాడ్గె, సర్పంచ్, ముక్రా(కే), ఇచ్చోడ మండలం