మంచిర్యాల, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ) : చెన్నూర్ భూములకు తరతరాలు తరగని జలసిరులనిచ్చే ‘లిఫ్ట్’ను గిఫ్ట్‌గా అందించిన అపరభగీరథుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌కు నేడు(సోమవారం) ఉదయం 10 గంటలకు కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నూర్ నియోజకవర్గకేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రైతుల పక్షాన ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరుకానున్నారు. భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు తరలివచ్చి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలపాలని విప్ బాల్క సుమన్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నేడు చెన్నూర్‌లో సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ నిర్వహించే కృతజ్ఞత సభలో అందరూ పాల్గొనాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క నియోజకవర్గం కోసం ప్రభుత్వం భారీ పథకాన్ని మంజూరు చేయడం మామూలు విషయం కాదు. నేను కోరిన వెంటనే చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆమోదం తెలపడంతోపాటు రూ.1,658 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. లిఫ్ట్ ద్వారా నియోజకవర్గంలోని ఐదు మండలాలు 103 గ్రామాల్లోని 90 వేల ఎకరాల సాగు నీరందుతుంది. రాబోయే నెలలో ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తారు. అనంతరం పనులను వేగవంతం చేస్తాం.
– బాల్క సుమన్, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు