ఆదిలాలాబాద్ రూరల్, ఏప్రిల్ 16 : ఆదిలాబాద్‌లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ చిన్న జయంతి శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయాలను కాషాయరంగు జెండాలు, తోరణాలతో అలంకరించారు. అర్చకులు వేద పారాయణం చేసి అభిషేకాలు, తమలపాకులు, తులసీమాలలతో విశేషంగా తీర్చిదిద్దారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సంజయ్‌నగర్‌లోని పంచముఖి హనుమాన్ మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. శాంతినగర్‌లోని సాయిబాబా ఆలయంలో గల హనుమాన్ ఆలయం, భుక్తాపూర్ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే దంపతులు జోగు రామన్న రమ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కుమ్మరివాడ, శాంతినగర్, భుక్తాపూర్, గాంధీనగర్, మహాలక్ష్మీవాడల్లోని హనుమాన్ ఆలయాల్లో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఎంపీపీ గోవర్ధన్, నాయకులు వెంకట్‌రెడ్డి, అజయ్, ప్రకాశ్ ఉన్నారు.
తలమడుగు, ఏప్రిల్ 16: మండలంలోని కోసాయి గ్రామంలో గల పురాతన హనుమాన్ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, ఎంపీపీ కల్యాణం లక్ష్మి, సామాజిక కార్యకర్త త్రియంబక్ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. సుంకిడిలో గల తిరుమల స్టోన్ క్రషర్ వద్ద నిర్మించిన హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, డెయిరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ ఎంపీ నగేశ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ప్రవళిక, మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తలమడుగులో యువజన సంఘాల ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. గ్రామంలోని పలువీధుల గుండా శోభాయాత్ర నిర్వహించి వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ వెంకటేశ్, సర్పంచ్ మహేందర్ యాదవ్, కనపర్తి చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, ఏప్రిల్ 16 : మండలంలోని మన్నూర్ గ్రామంలో భక్తులు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. లింగాపూర్‌లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకొని భజనలు చేశారు. మహిళలు, హనుమాన్ మాలధారులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
నేరడిగొండ, ఏప్రిల్ 16 : నేరడిగొండలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో జడ్పీటీసీ జాదవ్ అనిల్పాల్గొని పూజలు చేశారు. తేజాపూర్, వడూర్, వాంకిడి, కొర్టికల్, కుమారి, తర్నం, కిష్టాపూర్, యాపల్‌గూడ, గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో భక్తులు పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. చించోలి హనుమాన్ మందిరానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, నేరడిగొండ వీడీసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ శివారెడ్డి, వైస్‌ఎంపీపీ మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, ఏప్రిల్ 16: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో అ ర్చకులు స్వామి వారికి విశేష పూజ లు, అభిషేకాలు చేశారు. హనుమంతుడి విగ్రహాలకు భక్తులు పాలాభిషేకాలు నిర్వహించారు.
సిరికొండ, ఏప్రిల్ 14 : మండల కేంద్రంలో హనుమన్ చిన్న జయంతి సందర్భంగా ఆలయంలో కమిటీ సభ్యులు హుండీ లెక్కింపు చేశారు. ఈ సంవత్సరం ఆదాయం రూ.29 వేలు వచ్చాయని కమిటీ సభ్యులు తెలిపారు.
తాంసి, ఏప్రిల్16: పొన్నారిలోని సంకటమోచన హనుమాన్ మందిరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కళాకారులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ వేడుకల్లో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
బోథ్(నేరడిగొండ), ఏప్రిల్ 16 : బోథ్‌లో దీక్షాపరులు ,భక్తులు ట్రాక్టర్లో హనుమాన్ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. డీజేతో భక్తులు నృత్యాలు చేశారు. హనుమాన్ ఆలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
భీంపూర్, ఏప్రిల్ 16 : భీంపూర్, కరంజి(టీ), గుబ్‌డి, గోముత్రి, అంతర్గాం, నిపాని, పిప్పల్‌కోటి, గొల్లగడ్ గ్రామాల్లో హనుమాన్ దీక్షాపరులు 101 సార్లు చాలీసా పారాయణం చేశారు. గోముత్రి పెన్‌గంగ మధ్య గల ఆలయంలో ఓమయ్య మహారాజ్ భక్తులు జెండా ఆవిష్కరించారు. పిప్పల్‌కోటి, అర్లి(టీ) హనుమాన్ మందిరంలో ముస్లిం సోదరులు పూజలు చేశారు. అన్నదానం కోసం వారు వంటలు చేశారు.
ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 16: హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి గ్రామంలో భారీ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ లక్ష్మీ జగదీశ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరేశ్, కనక రమణ, యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
జైనథ్, ఏప్రిల్ 16: జైనథ్, దీపాయిగూడ హనుమాన్ ఆలయాల్లో స్వామి వారిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పెండల్వాడ ఆత్మలింగ ఆంజనేయ స్వామి ఆలయంలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ గోవర్ధన్, వైస్‌ఎంపీపీ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, నాయకులు చంద్రయ్య, పురుషోత్తం యాదవ్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 16 : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ ప్రకారం వాయిద్యాలు వాయిస్తూ హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. మండల కేంద్రంలోని కొబ్బయిగూడలో ఆదివాసీ పురోహిత్ ప్రధాన్ సమాజ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు.
ఉట్నూర్, ఏప్రిల్ 16: మండల కేంద్రంలోని వినాయక్ చౌక్‌లో గల హనుమాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్, నాయకులు వెడ్మ బొజ్జు, యువత, తదితరులు పాల్గొన్నారు. ఉట్నూర్ సీఐ సైదారావు, ఎస్ఐలు భరత్ సుమన్, రవికిరణ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.