పుష్కరవేళ పిండప్రదానం విశేష ఫలదాయకమైనది. రామాయణ కాలం నుంచే విశిష్టత కొనసాగుతున్నది. తల్లిదండ్రుల వైపు నుంచి అటు ఏడు, ఇటు ఏడు మొత్తం 14 తరాల వారికి పిండప్రదానం చేయవచ్చు. ప్రాణహిత పుష్కరాల్లో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నారు. కాగా.. నాలుగు రోజుల్లో 2.52 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇందులో శనివారం ఒక్కరోజే కోటపల్లికి 60వేలు, వేమనపల్లికి 12 వేలు, తుమ్మిడిహట్టికి 1000 మంది భక్తులు తరలివచ్చి పుష్కరస్నానాలు ఆచరించారు.
కోటపల్లి, ఏప్రిల్ 16 : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద గల ప్రాణహితకు భక్తుల రద్దీ పెరుగుతున్నది. కోటపల్లి, వేమనపల్లి, కౌటాల వద్దకు నాలుగు రోజుల్లో 2.52 లక్షల మంది భక్తులు వచ్చారు. ఇందులో శనివారం ఒక్కరోజే కోటపల్లికి 60 వేలు, వేమనపల్లి వద్దకు 12వేలు, తుమ్మిడిహట్టి వద్దకు 1000 మంది భక్తులు తరలివచ్చి పుష్కరస్నానాలు ఆచరించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరాగా.. ఇబ్బందులు కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. చెన్నూర్ పట్టణానికి చెందిన యువత ఆధ్వర్యంలో భక్తులకు మంచినీటిని అందజేశారు. సత్యసాయి సేవాసంస్థ, సైకిల్ బాబా ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
శనివారం సాయంత్రం వరంగల్ జిల్లా సోమేశ్వర లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ప్రాణహిత నదికి హారతి కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ప్రాణహితకు పూజలు జరిపి హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వర లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయం కార్యనిర్వహణ అధికారి రజనీ కుమారి, పుష్కరఘాట్ ఇన్చార్జి అనూష పాల్గొన్నారు.
అమెరికాకు చెందిన జాన్కేన్ ట్రైబల్ హెల్త్‌కేర్‌పై పరిశోధన చేస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నది. వరంగల్ జిల్లాకు రాగా ప్రాణహిత పుష్కరాల గురించి తెలుసుకుని కోటపల్లికి వచ్చినట్లు తెలిపింది. నదిలో స్నానం చేస్తే ముక్తి కలుగుతుందని ఇక్కడి పండితులు తెలిపారని.. అందుకే పుష్కరస్నానం ఆచరించినట్లు వివరించింది.ప్రాణహితలో పుష్కరస్నానం చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్‌లోని ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి కూడా పుష్కరస్నానం ఆచరించారు. ఎమ్మెల్యేతోపాటు యశోద హాస్పిటల్ ప్రముఖ వైద్యులు దశరథ రామారెడ్డి కూడా ఉన్నారు.
వేమనపల్లి, ఏప్రిల్ 16 : వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద భక్తులు పో టెత్తారు. బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని మండలాల నుంచి భక్తులు ప్రైవేటు వాహనాల్లో తరలివచ్చారు. చిన్నారులు, యువతీయువతులు కేరింతలు కొడు తూ పుష్కర స్నానాలు చేశారు. జైపూర్ ఏసీపీ నరేందర్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండప్రదానం చేశారు. అనంతరం భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డీఎల్పీవో ఫణీందర్‌కు సూచించారు. ఏసీపీ వెంట టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వేణుమాధవ్‌రావు, ఎంపీపీ గణపతి, సర్పంచ్‌లు మధూకర్, కొండగొర్ల బాపు ఉన్నారు.
కౌటాల, ఏప్రిల్ 16 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద గల ప్రాణహితలో శనివారం 1000 మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. నాలుగు రోజులుగా దాదాపు ఐదు వేల మంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పుష్కర ఘాట్ ఇన్చార్జి వేణుగోపాల్ గుప్తా, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కౌటాల సీఐ స్వామి ఆధ్వర్యంలో ఎస్ఐ మనోహర్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్ ఏర్పాట్లను తహసీల్దార్ రాంలాల్, ఎంపీవో శ్రీధర్ రాజు, ఎంఆర్ఐ దేవేందర్ పర్యవేక్షించారు.