నిర్మల్ జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రస్తుతం జిల్లాలో 1,01,068 మంది కూలీలు పనులకు వస్తుండగా, ఉపాధి పనుల కల్పనలో రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానం దక్కించుకుంది. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముగియగా, ఈజీఎస్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
నిర్మల్, మే 13(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలో 15 రోజులతో పోలిస్తే ప్రస్తుతం ఉపాధి పనులకు కూలీల హాజరు సంఖ్య పెరిగింది. వ్యవసాయ పనులు పూర్తి కావడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 15 రోజుల క్రితం 82,466 మంది కూలీలు ఉపాధి పనులకు రాగా, ప్రస్తుతం రోజుకు 1,01,068 మంది కూలీలు హాజరవుతున్నారు.
ఇంత పెద్ద ఎత్తున కూలీలకు పని కల్పించడంతో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాకు మొదటి ర్యాంకు వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి వ్యవసాయ పనులు పూర్తయిన దృష్ట్యా భూములను చదును చేసే పనులతోపాటు మట్టి రోడ్ల నిర్మాణం, చెరువుల పూడికతీత పనులు, నీటి ఊట గుంతల నిర్మాణం, వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను హరితహారంలో భాగంగా నర్సరీల్లో మొక్కలు పెంచడం.. తదితర పనులు కొనసాగుతున్నాయి.
మరో వైపు ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి 2 లక్షల 79 వేల పని దినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటి వరకు 15లక్షల పని దినాలను జిల్లా యంత్రాంగం కల్పించింది. అంతే కాకుండా ప్రతి కూలీకి వందరోజులపాటు పని కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు రోజుకు రూ.257 అందజేస్తున్నారు. గతంలో రూ.245 ఉన్న రోజువారీ కూలిని గత మార్చి నెలలో రూ.257లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా జిల్లా వ్యాప్తంగా 1,78,948ల జాబ్ కార్డులు ఉండగా 3,67,054 మంది కూలీలు ఉన్నారు.
జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య 15రోజులతో పోలిస్తే ప్రస్తుతం 20వేల వరకు పెరిగింది. జిల్లాలో మొత్తం 396 గ్రామ పంచాయతీలు ఉండగా 395 పంచాయతీల్లో పనులు కొనసాగుతున్నాయి. కాగా పెద్దసంఖ్యలో కూలీలు హాజరవుతున్నందున అధికారులు కొత్తగా చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈసారి నీటిని సంరక్షించుకునే జలశక్తి అభియాన్ పనులపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.
వీటితోపాటు చెరువుల్లో పూడిక తీత, అసైన్డ్ భూముల్లో బండరాళ్లను తొలగించడం, భూములను చదును చేయడం, ఎరువు గుంతల నిర్మాణం, అమృత్ సరోవర్ కింద కొత్త చెరువులను తవ్వడం, అడవుల్లో కందకాలను తవ్వడం మొదలగు పనులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కాగా గత ఆర్థిక సంవత్సరంలో 82 లక్షల 64వేల పనిదినాలను కల్పించడం లక్ష్యంగా నిర్ణయించగా, ఈ ఆర్థిక సంవత్సరానికి 20లక్షల 15వేల పనిదినాలను పెంచుతూ కోటీ 2లక్షల 79వేల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కూలీలకు ఉపాధి కల్పించడంలో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. రోజుకు లక్ష మందికి పైగా కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ప్రతి పంచాయతీ నుంచి 200 మందికి సగటున ఉపాధి కల్పించాలని ఉన్నతాధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. నిర్మల్ జిల్లాలో అంతకంటే ఎక్కువగా 10 రోజుల నుంచి సగటున 255 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాం. దీంతో జిల్లాకు మొదటి ర్యాంకును కేటాయించారు.
రెండో స్థానంలో 211 సగటుతో జయశంకర్ భూపాలపెల్లి జిల్లా, మూడో స్థానంలో 208 సగటుతో సూర్యాపేట జిల్లాలున్నాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం 52వేల మంది కూలీలు మాత్రమే పనులకు హాజరయ్యారు. ఈసారి ఆసంఖ్య రెట్టింపయ్యింది. తరచూ సమీక్షలు నిర్వహించడం, ఉదయం 6 గంటలకల్లా క్షేత్రస్థాయికి వెళ్లి కూలీల సంఖ్య అధికంగా ఉన్న గ్రామాలపై ఫోకస్ చేస్తూ… అక్కడున్న ప్రజాప్రతినిధుల సహకారం వల్లే ఇంతమంది కూలీలకు పని కల్పించగలిగాం.
-విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, నిర్మల్