వానకాలం ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 10.21 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. గతేడాది కంటే ఈ సారి పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండగా, రైతులకు అండగా రాష్ట్ర సర్కారు పథకాలు నిలుస్తున్నాయి.
రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల పంపిణీ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, పంటల కొనుగోళ్లు రైతాంగానికి వరంగా మారనున్నాయి. ఈసారి పత్తి సాగు పెరిగే అవకాశముందని గుర్తించగా, ఇప్పటికే నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసే పనిలో అధికార వర్గాలు నిమగ్నమయ్యాయి.
ఆదిలాబాద్, మే 13 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. అమలు చేస్తున్న పథకాలు అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి. దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువుల పంపిణీ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, పంటల కొనుగోళ్లు లాంటి పథకాలు అన్నదాతకు వరంగా మారాయి.
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రాష్ట్ర రైతాంగంపై వివక్ష ప్రదర్శిస్తున్నది. సాగునీటి పథకాలతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారగా.. సాగునీటితో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. దీంతో దేశంలోనే మన రాష్ట్రం ధాన్యాగారంగా మారింది. వడ్లతో పాటు ఇతర పంటలను కొనుగోలు చేయాల్సిన కేంద్ర ప్రభు త్వం అందుకు నిరాకరిస్తున్నది. రైతులు అహర్నిశలు కష్టపడి సాగు చేసిన పంటలను దళారులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోవద్దన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వడ్లతో పాటు ఇతర పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోళ్లు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జోరుగా సాగుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో దండుగలా మారిన వ్యవసాయం.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పండుగలా మారింది. ఆదిలాబాద్, నిర్మ ల్ జిల్లాల్లో ఏటా పంటల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. రెండు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగువుతున్నాయి. పట్టణాల్లో కార్పొరేట్ ఉద్యోగాలు చేసే వారు తమ గ్రామాలకు తిరిగొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. గతేడాది వానకాలంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రైతులు 9.87 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు.
ఈ సంవత్సరం పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. రెండు జిల్లాల్లో వానకాలం సీజన్లో 10.21 లక్షల ఎకరాల్లో అన్నదాతలు వివిధ పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. గతేడాది ఆదిలాబాద్ జిల్లాలో 5.62 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈ సంవత్సరం 5.71 లక్షల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 4.25 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను పండించారు. రానున్న సీజన్లో 4.50 లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేయనున్నారు.
గతేడాది కంటే ఈ సంవత్సరం వానకాలంలో రెండు జిల్లాల్లో 34 వేల ఎకరాల్లో అదనంగా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. పత్తి, వరి, కంది, సోయాబీన్ పంటలను ఎక్కువగా సాగు చేయనున్నారు. గతేడాది పత్తి పంట రైతులకు లాభదాయకంగా మారింది. క్వింటాకు రూ.12 వేల వరకు ధర పలికింది. ఈ ఏడాది రెండు జిల్లాలో పత్తి, కంది పంట సాగు పెరుగనున్నది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడానికి రైతులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. నకిలీ విత్తనాల నివారణలో భాగంగా పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, టాస్క్ఫోర్స్ బృందాలు దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.